Aarogyasri Strike: ఆ 15 హాస్పిటల్స్‌లో అడ్మిషన్లు లేవ్!
వరంగల్లోని క్యూర్ వెల్‌తో పాటు అడ్మిషన్లు నిల్
సమ్మె చేస్తున్న దవాఖాన్లలో ట్విస్ట్
రెండు టీమ్‌లుగా ప్రైవేట్ హాస్పిటల్స్
ఒక వర్గంపై మరో వర్గం బెదిరింపులు..!
సర్కార్ చేతికి ఆడియో లీకులు!
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఆరోగ్య శ్రీ సమ్మె (Aarogyasri Strike) వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న 15 హాస్పిటల్స్‌లో కనీసం ఒక్క అడ్మిషన్ కూడా లేదని ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. ఇందులో నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ రాకేష్ రెడ్డి నిర్వహిస్తున్న క్యూర్‌వెల్ హాస్పిటల్ కూడా ఉన్నట్లు తెలిసింది. సుమారు 6 నెలలుగా ఒక్క పేషెంట్‌కు కూడా ఆరోగ్య శ్రీ కింద అడ్మిషన్లు ఇవ్వలేదని బోర్డు గుర్తించింది. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనది. ఆరోగ్య శ్రీ నిబంధనలు ప్రకారం వరుసగా 6 నెలల పాటు ఆరోగ్య శ్రీ కేసులు చేయకపోతే, ఆ హాస్పిటల్స్ ఎంప్యానల్ రద్దు చేసే ఛాన్స్ ఉంటుంది.
మరోవైపు, ప్రైవేట్ హాస్పిటల్స్ రెండు టీమ్‌లుగా ఏర్పడ్డాయి. ఇందులో నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ కింద లేని హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీలో యథావిథిగా సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్, సమ్మెలో లేని హాస్పిటల్స్‌పై బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోగ్య శ్రీ బోర్డు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఆడియోను కూడా సేకరించే పనిలో ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు ఆరోగ్య శ్రీ సమ్మె అంశంలో సీరియస్‌గా వ్యవహరించనున్నారు.
Read Also- Rail Ticket Booking: ఈజీగా అన్‌రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్.. దక్షిణమధ్య రైల్వే సరికొత్త ముందడుగు
ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ సీఈవో ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. రెండో రోజూ కూడా మెజార్టీ హాస్పిటల్స్‌లో ఆరోగ్య శ్రీ సేవలు అందినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 477 ఎంప్యానల్డ్ హాస్పిటళ్లలో కేవలం 50 లోపు మాత్రమే సమ్మెలో ఉన్నట్లు తెలిపారు. పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా
వైద్య సేవలు కొనసాగించాలని మరోసారి ఆయా హాస్పిటళ్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఆరోగ్యశ్రీ కింద గత రెండు వారాలుగా సగటున రోజూ 844 సర్జరీలు నమోదవ్వగా, బుధ, గురువారాల్లో సగటున 814 సర్జరీలు నమోదైనట్లు తెలిపారు. వైద్య సేవలు కొనసాగిస్తున్న హాస్పిటళ్ల యజమానులు, డాక్టర్లకు సీఈవో కృతజ్ఞతలు తెలిపారు. అయితే కొంతమంది తమకు ఫోన్లు చేసి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని బెదిరిస్తున్నట్లు బోర్డుకు ఫిర్యాదు అందుతున్నాయి. బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఈవో వార్నింగ్ ఇచ్చారు. పేద ప్రజల పక్షాన నిలుస్తున్న దవాఖాన్లకు వంద శాతం ప్రభుత్వం నుంచి సపోర్టు ఉంటుందని వెల్లడించారు.