Beerla Ilaiah: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Beerala Ilaiah) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి సొమ్ముతో కేటీఆర్(KTR) బలుపెక్కి మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా తన తప్పులను ఒప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయం అత్యంత నీచమైన స్థాయికి పడిపోయిందని విమర్శించారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా, కేటీఆర్ తన సొంత బావ హరీశ్ రావు, చెల్లె కవిత ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని ఐలయ్య ఆరోపించారు. హరీశ్ వ్యక్తిగత సిబ్బంది ఫోన్లపై కూడా నిఘా పెట్టడం కల్వకుంట్ల కుటుంబంలోని అంతర్గత విభేదాలకు నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫోన్లను కూడా ట్యాప్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Also Read: Medaram Jatara: మేడారం జాతర ఏర్పాట్లలో కలెక్టర్, ఎస్పీ ఫుల్ బిజీ.. ఎక్కడికక్కడ తనిఖీలు
సిట్ విచారణలో మైండ్ బ్లాంక్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక హరీశ్ రావు విస్తుపోయారని ఐలయ్య ఎద్దేవా చేశారు. నిజాలు బయటకు వస్తుండటంతో ఆయనకు మైండ్ బ్లాంక్ అయిందని, దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. తాను శుద్ధపూసనని కేటీఆర్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని, బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని అర్థం కావడంతోనే డ్రామా రావు కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌తో పుట్టిన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన రోజే తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి ఉన్న పేగుబంధం తెగిపోయిందని ఐలయ్య స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రజల సంక్షేమం కంటే అక్రమంగా సంపాదించిన డబ్బులే ముఖ్యమని, వారి స్వార్థం కోసమే పరిపాలన సాగించారని విమర్శించారు. త్వరలోనే వారి అవినీతి సామ్రాజ్యం కుప్పకూలుతుందని బీర్ల హెచ్చరించారు.
Also Read: Honor Robot Phone: ప్రపంచంలోనే తొలి రోబోటిక్ మెుబైల్.. లాంచ్ డేట్ షురూ.. ఈ ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

