Medaram Jatara: జాతరకు వెళ్లే భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలి
అధికారులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మఆదేశాలు
భూపాలపల్లి, స్వేచ్ఛ: మేడారం జాతరకు (Medaram Jatara) వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు భూపాలిపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన కాటారం నుంచి మహా ముత్తారం వరకు, భూపాలపల్లి నుంచి గొల్ల బుద్దారం వరకు ఉన్న ఆర్ అండ్ బీ రహదారుల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారుల మరమ్మత్తులు, గుంతల పూడ్చివేత, రోడ్డు వెడల్పు, సైన్‌బోర్డుల ఏర్పాటు, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కమలాపూర్‌లో జరుగనున్న మినీ మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు అవసరమైన తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, పారిశుధ్యం, పార్కింగ్ సౌకర్యాలు సమృద్ధిగా కల్పించాలని, భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రవాణా నియంత్రణ, ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచనలు చేశారు. మినీ మేడారం ఆలయ పూజారులకు భవన నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ అధికారి రమేష్, తహసీల్దార్ శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రహిత మేడారం అందరి లక్ష్యం: జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్
ములుగు, స్వేచ్ఛ: ‘అరణ్యమే ఆలయంగా… ప్రకృతే దేవతలు’ అనే భావనకు ప్రతీకగా నిలిచే మేడారం మహా జాతరలో ప్లాస్టిక్ నివారణపై జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ ప్రత్యేక దృష్టి సారించారు. వనదేవతల సన్నిధిలో ప్రకృతిని కలుషితం చేయరాదన్న సంకల్పంతో ‘ప్లాస్టిక్ రహిత మేడారం’ లక్ష్యంగా పోలీస్ అధికారులు స్వచ్ఛందగా తమ శాఖా సమన్వయంతో పనిచేస్తున్నారు. జాతర పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధానికి అడుగులు వేశారు.
ప్లాస్టిక్ కవర్లతో కూడిన బఫ్ ప్లేట్లు, గ్లాసులు, బాటిళ్ల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎస్పీ రామ్నాథ్ కేకన్ తెలిపారు. వాటి స్థానంలో ప్రకృతి వరప్రసాదితమైన ఆకులతో తయారు చేసిన విస్తారాకుల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ క్రమంలో శ్రీ వినాయక గ్రామైఖ్య సంఘం ములుగు మండలం జగ్గన్న పేట మహిళల ఆధ్వర్యంలో ఆకులతో తయారుచేసిన విస్తారాకులను పరిశీలించారు. గుడ్డతో తయారు చేసిన సంచులు, కాగితపు ప్యాకెట్లు వినియోగించాలంటూ భక్తులకు సూచించారు. వనదేవతలకు చేసే పూజలతో పాటు, వనాల పరిరక్షణ కూడా భక్తుల తమ బాధ్యతయుతంగాగా ఉండాలన్నారు. అందరి సహకారంతోనే ప్లాస్టిక్ రహిత మేడారం లక్ష్యం సాధ్యమని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఆదివాసి నవనిర్మాణం సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కొర్స నరసింహమూర్తి, జిల్లా సమాఖ్య మేనేజర్ కిషన్ రావు పాల్గొన్నారు.
Read Also- Hyderabad Crime: మైసమ్మగూడలో తీవ్ర కలకలం.. వ్యక్తిపై కత్తితో దాడి!

