Ponnam Prabhakar: రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగర స్వభావాన్ని, పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రణాళికలతో ప్రజాసేవలను అందించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ శాఖల పురోగతిని మంత్రి సమీక్షించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజన పథకం అమలుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
స్వచ్ఛంద సేవే లక్ష్యం
వైద్య రంగంలో బస్తీ దవాఖానాలు, ఆరోగ్యశ్రీ సేవలను మరింత బలోపేతం చేయాలని వైద్యాధికారులకు సూచించారు. అలాగే నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, కొత్త బస్సు మార్గాల ప్రారంభం, ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. విద్యుత్ శాఖకు సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ప్రభుత్వ భూముల సంరక్షణ, మీ-సేవా కేంద్రాల ద్వారా త్వరితగతిన సేవలందించడం వంటి అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతూ రోడ్ సేఫ్టీపై అధికారులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ జితేందర్ రెడ్డి, డీఆర్ఓ వెంకటాచారి, సీపీఓ డాక్టర్ సురేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, జిల్లా సంక్షేమ అధికారులు ఆశన్న, అక్కేశ్వరరావు, ఇలియాస్ అహ్మద్, ప్రవీణ్ కుమార్, కోటాజి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read: Ponnam Prabhakar: రోడ్డు సేఫ్టీ మన జీవితంలో అంతర్భాగం కావాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

