Ponnam Prabhakar: రాష్ట్రంలో ప్రస్తుతం కోటి 80 లక్షల వాహనాలు ఉండగా, వాటి తనిఖీ కోసం 550 పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. కాలుష్య నియంత్రణను మరింత పటిష్టం చేసేందుకు త్వరలోనే 15 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో వీటి సంఖ్యను 37కు పెంచుతామని వెల్లడించారు. అసెంబ్లీలో రవాణా రంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, 15 ఏళ్లు పైబడిన ఆర్టీసీ, ప్రభుత్వ వాహనాలను ఇప్పటికే స్క్రాపింగ్‌కు పంపిస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ వాహనాల విషయంలో గ్రీన్ టాక్స్ పేరుతో వెసులుబాటు కల్పించామని, అయితే దీనివల్ల కఠినంగా వ్యవహరించలేకపోతున్నామన్న అంశాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్ జారీలో పారదర్శకత కోసం ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
Also Read:Ponnam Prabhakar: రోడ్డు సేఫ్టీ మన జీవితంలో అంతర్భాగం కావాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
తనిఖీలు.. జరిమానాలు
ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ ఉక్కుపాదం మోపుతోందని మంత్రి స్పష్టం చేశారు. గత 24 నెలల్లో హైదరాబాద్ పరిధిలో ఫిట్నెస్ లేని 22,340 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ. 4.28 కోట్లు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని 28,970 వాహనాలపై కేసులు పెట్టి రూ. 2.38 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించారు. నగరంలోని వాటర్ ట్యాంకర్లు, స్కూల్ బస్సులు, ఐటీ, ఫార్మా కంపెనీల వాహనాలు కాలుష్యానికి కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలు కొంటే 20% మినహాయింపు ఇస్తున్నామని, పీఎం ఈ-డ్రైవ్ కింద దశలవారీగా 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని పొన్నం ప్రభాకర్ వివరించారు.

