Starlink Monthly Plan: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్‌ఎక్స్‌కు (SpaceX) స్టార్‌లింక్ (StarLink) కీలక ప్రకటన చేసింది. భారత్‌లో రెసిడెన్షియల్, అంటే ఇళ్లలో ఉపయోగించే వినియోగదారులకు ప్లాన్ ధరలను (Starlink Monthly Plan) వెల్లడించింది. ఇళ్లకు మంత్లీ ప్లాన్ రూ.8,600గా స్టార్‌లింక్ వెల్లడించింది. ఈ మొత్తానికి అదనంగా కస్టమర్లు వన్-టైమ్ హార్డ్‌వేర్ కిట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర రూ.34,000 అని వెల్లడించింది. హార్డ్‌వేర్ కిట్‌లో డిష్ యాంటెనా, రౌటర్, కేబుల్స్, పవర్ కేబుల్ వంటివి ఉంటాయి. అపరిమితమైన ఇంటర్నెట్‌ను పొందవచ్చని, కొత్త యూజర్లకు 30 రోజుల ట్రయల్ పీరియడ్‌ను కూడా అందిస్తామని తెలిపింది. 99.9 శాతం సర్వీస్, నెట్‌వర్క్‌లో ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ అందుతుందని స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుతం ప్రకటించింది కేవలం రెసిడెన్షియల్ ప్లాన్ మాత్రమే. వ్యాపారులు, కంపెనీల కోసం ఇంకా ప్లాన్స్‌ను వెల్లడించలేదు.
మంత్లీ ప్లాన్స్ రూ.3000-రూ.4,200 వరకు ఉండొచ్చంటూ గతంలో ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, అంతకు రెట్టింపు ఉండడంతో భారతీయ వినియోగదారుల నుంచి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అయితే, మారుమూల ప్రాంతాలు, బ్రాడ్‌బాండ్ సౌకర్యం లేని ప్రాంతాల వారికి స్టార్‌లింక్ చక్కటి ఆప్షన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 24 గంటలపాటు డేటా లిమిట్ లేదు కాబట్టి, వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, మంత్లీ రూ.8,600 సబ్‌స్క్రిప్షన్ ఫీజలు, కనెక్షన్‌కు అవసరమైన హార్డ్‌వేర్‌ను ఏకంగా రూ.34 వేలు వెచ్చించి కొనడమంటే యూజర్లకు చాలా కష్టమనే చెప్పాలి. అయితే, కాగా, స్టార్‌లింక్ సాంప్రదాయ కేబుల్, టవర్ నెట్‌వర్క్‌లపై ఆధారపడకుండా, శాటిలైట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తోంది. శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందడంతో ఫైబర్ వైర్లు, లేదా భూగర్భంలో కేబుల్స్ లేకుండానే సులభంగా సేవలు పొందవచ్చు. స్టార్‌లింక్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాది శాటిలైట్లు ఉపయోగించి బ్రాడ్‌బాండ్ సేవలు అందిస్తోంది.
పోటీ ఇస్తుందా?, చతికిల పడుతుందా?
ప్రస్తుతం భారతదేశంలోని జియో ఫైబర్, ఎయిర్‌టెల్ సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కస్టమర్లకు చేరువయ్యాయి. పట్టణ, నగర ప్రాంతాలలో నివసించేవారు జియో ఫైబర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ వంటి భూ-ఆధారిత ఫైబర్ సేవలు పొందుతున్నారు. మెరుగైన స్పీడ్ సేవలను సరసమైన ధరలకే పొందుతున్నారు. ఫైబర్ ప్లాన్‌లు నెలకు రూ.399 నుంచి రూ.999 రేంజ్‌లలో ప్రారంభమవుతున్నాయి. ఈ ధరలకే 100 ఎంబీపీఎస్, లేదా అంతకంటే ఎక్కువ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ లభిస్తోంది.
హార్డ్‌వేర్ అంటే, ఫైబర్ కనెక్షన్‌లలో రౌటర్ కూడా ఉచితంగా, లేదా తక్కువ అడ్వాన్స్ పేమెంట్‌తో లభిస్తోంది. అంతేనా, ఫైబర్ ప్లాన్‌లలో నెట్‌ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోస్టార్ వంటి సబ్‌స్క్రిప్షన్‌లు ఉచితంగా లభిస్తున్నాయి. దీంతో, యూజర్లు అదనపు బెనిఫిట్స్ పొందుతున్నారు. జియో ఫైబర్, ఎయిర్‌టెల్ ఈ చౌకగా సేవలు అందిస్తుండగా, స్టార్‌లింక్ వైపు యూజర్లు ఎందుకు మొగ్గుచూపాలి? అనేది ఆసక్తికరంగా మారింది. జియో, ఎయిర్‌టెల్‌లకు స్టార్‌లింక్ పోటీ ఇస్తుందా? లేక, చతికిల పడుతుందా? అనేది చూడాలి.

