Motorola Edge 70: మోటోరోలా తన ప్రీమియం మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. మోటోరోలా ఎడ్జ్ 70 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు (డిసెంబర్ 15) భారత మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. ఇది గతంలో మంచి ఆదరణ పొందిన ఎడ్జ్ 60కు అప్ గ్రేడ్ గా రానుంది. డిజైన్, కెమెరాలు, డ్యూరబిలిటీతో పాటు ఆధునిక సాఫ్ట్‌వేర్, ఏఐ ఫీచర్లపై ఈ ఫోన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కంపెనీ వెల్లడించింది.
మోటోరోలా అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం, ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ లిల్లీ ప్యాడ్, గాడ్జెట్ గ్రే, బ్రాంజ్ గ్రీన్ అనే మూడు కలర్ వేరియంట్లలో మన ముందుకు రానుంది.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్, స్టైలిష్ డిజైన్‌తోనే వస్తోంది. వెనుక భాగంలో స్క్వేర్ + సర్కిల్ మిక్స్‌లా ఉండే కెమెరా మాడ్యూల్, చేతితో పట్టుకుంటే ప్రీమియం ఫీల్ ఇచ్చే వీగన్ లెదర్ ఫినిష్ ఈ ఫోన్‌కు పెద్ద ప్లస్ పాయింట్స్.
ఎడ్జ్ 70 ఫోన్ మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810H) టెస్టులు పాస్ అయిందట. అంటే రోజువారీ వాడకంలో కింద పడినా కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. అలాగే దీనికి IP68, IP69 రేటింగ్‌లు ఉండటంతో దుమ్ము పడినా, నీటిలో కొద్దిసేపు మునిగినా పెద్దగా ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ముందు డిస్‌ప్లేకు కోర్నింగ్ గోరిల్లా గ్లాస్ 7i రక్షణ ఉండటంతో స్క్రాచ్‌లు, చిన్న దెబ్బల నుంచి మంచి ప్రొటెక్షన్ లభిస్తుంది.
డిస్‌ప్లే & ఆడియో ఫీచర్లు
ముందుభాగంలో 6.7 ఇంచుల AMOLED డిస్‌ప్లే ఇవ్వబడింది. దీనికి 1.5K రిజల్యూషన్, గరిష్టంగా 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండడం వల్ల ఎండలో కూడా స్పష్టమైన విజువల్స్ లభిస్తాయి. ఆడియో విషయంలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండటం వల్ల సినిమాలు, మ్యూజిక్‌కి మంచి ఇమర్సివ్ అనుభవం లభిస్తుందని మోటోరోలా చెబుతోంది.
ట్రిపుల్ 50MP కెమెరా సెటప్
కెమెరాల విషయంలో ఎడ్జ్ 70 బలంగా కనిపిస్తోంది. వెనుక భాగంలో ట్రిపుల్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒక 50MP ప్రైమరీ కెమెరా, ఒక 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, మూడో కెమెరా కలిపి పూర్తి సెటప్ అందిస్తుంది. ముందుభాగంలో 50MP క్వాడ్-పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వనున్నారు. అన్ని కెమెరాల నుంచీ 4K వీడియో రికార్డింగ్ (60fps) సపోర్ట్ ఉండటం ఈ ఫోన్‌ను కంటెంట్ క్రియేటర్లు, వీడియో ప్రేమికులకు మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.
పనితీరు, బ్యాటరీ & సాఫ్ట్‌వేర్
మోటోరోలా ఎడ్జ్ 70లో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ బరువు కేవలం 159 గ్రాములు మాత్రమేనని సమాచారం. బ్యాటరీగా 5,000mAh సామర్థ్యం, 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందించనుంది.
సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ Android 16 ఆధారిత Hello UIతో రానుంది. మోటోరోలా ఈ డివైస్‌కు మూడు సంవత్సరాల Android OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు అందిస్తుందని అంచనా. మొత్తంగా చూస్తే, స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన కెమెరాలు, బలమైన నిర్మాణంతో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రీమియం మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనున్న ఫోన్‌గా కనిపిస్తోంది.

