Google Dark Web Report: గూగుల్ యూజర్ల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఉపయోగించే ‘డార్క్ వెబ్ రిపోర్ట్’ ఫీచర్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. యూజర్ డేటా లీక్ అయినట్లు తెలిసిన తర్వాత ఏం చేయాలనే విషయంలో ఈ ఫీచర్ స్పష్టమైన మార్గనిర్దేశం ఇవ్వలేకపోయిందన్న ఫీడ్‌బ్యాక్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది.
ఈ ఫీచర్‌ను గూగుల్ దశలవారీగా షట్‌డౌన్ చేయనుంది. 2026 జనవరి 15 నుంచి కొత్త డేటా లీక్‌ల కోసం స్కానింగ్ పూర్తిగా ఆగిపోతుంది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 16 నుంచి ‘డార్క్ వెబ్ రిపోర్ట్’ సేవ పూర్తిగా అందుబాటులో ఉండదు. అదే తేదీన ఈ సేవకు సంబంధించిన యూజర్ డేటా మొత్తాన్ని కూడా గూగుల్ తొలగించనుంది.
డార్క్ వెబ్ రిపోర్ట్‌ను యూజర్ల ఈమెయిల్ ఐడీలు, పాస్‌వర్డులు వంటి వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో కనిపిస్తే అలర్ట్ ఇవ్వడానికి రూపొందించారు. అయితే, ఈ అలర్ట్ వచ్చిన తర్వాత యూజర్లు ఏ చర్యలు తీసుకోవాలో స్పష్టత లేకపోవడంతో, ఈ ఫీచర్ అంతగా ఉపయోగపడలేదని గూగుల్ అంగీకరించింది. అందుకే మరింత ఉపయోగకరమైన భద్రతా టూల్స్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించింది.
ఈ ఫీచర్‌ను నిలిపివేస్తున్నా, ఆన్‌లైన్ భద్రత విషయంలో వెనక్కి తగ్గడం లేదని గూగుల్ స్పష్టం చేసింది. డార్క్ వెబ్‌కు సంబంధించిన ముప్పులను గుర్తించడం, యూజర్ల అకౌంట్లను రక్షించడం కొనసాగుతుందని తెలిపింది. అయితే, యూజర్లు తక్షణమే ఉపయోగించగలిగే స్పష్టమైన భద్రతా పరిష్కారాలపైనే ఇకపై దృష్టి ఉంటుందని పేర్కొంది.
Also Read: MS Subbulakshmi: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ తెరకెక్కించనున్న గీతా ఆర్ట్స్!.. దర్శకుడు ఎవరంటే?
డార్క్ వెబ్ రిపోర్ట్‌కు బదులుగా యూజర్లు Security Checkup, Passkeys, Google Password Manager, Password Checkup వంటి టూల్స్‌ను వినియోగించాలని గూగుల్ సూచిస్తోంది. అలాగే, గూగుల్ సెర్చ్‌లో యూజర్ల ఫోన్ నంబర్ లేదా ఇంటి చిరునామా వంటి వ్యక్తిగత వివరాలు కనిపిస్తే వాటిని తొలగించేందుకు ఉపయోగపడే ‘Results about you’ టూల్‌ను కూడా ప్రోత్సహిస్తోంది.
Also Read: GHMC: మేయర్, కమిషనర్‌ను కలిసిన ప్రజాప్రతినిధులు.. అభ్యంతరాలు, సలహాలను సమర్పించిన బీఆర్ఎస్!
డార్క్ వెబ్ రిపోర్ట్ మానిటరింగ్ ప్రొఫైల్‌కు సంబంధించిన డేటాను యూజర్లు కావాలంటే ముందే డిలీట్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్ కేవలం సాధారణ గూగుల్ అకౌంట్లకే అందుబాటులో ఉండేదని, వర్క్‌స్పేస్, సూపర్‌వైజ్డ్ అకౌంట్లకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. యూజర్ల ఆన్‌లైన్ భద్రతను సులభతరం చేయడమే తమ లక్ష్యమని గూగుల్ పేర్కొంది.

