Google Phone App: యూజర్లకు మరింత స్పష్టమైన కమ్యూనికేషన్, పవర్ యూజర్లకు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుభవం అందించేందుకు గూగుల్ కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. ఇవి కాల్స్‌ని మరింత స్పష్టంగా చూపించడానికీ, ఏఐ ఆలోచనా శక్తిని పెంచడానికీ ఉపయోగపడతాయని కంపెనీ చెబుతోంది.
ఫోన్ యాప్‌లో ‘ఎక్స్‌ప్రెసివ్ కాలింగ్’
Phone by Google బీటా యాప్ వాడుతున్న కొంతమందికి ఇప్పుడు Expressive Calling ఫీచర్ వస్తోంది. ముఖ్యమైన కాల్ వస్తే అది వెంటనే మనకు అర్థమయ్యేలా విజువల్ ఎఫెక్ట్స్, స్ట్రాంగ్ వైబ్రేషన్ చూపిస్తుంది.
ఈ ఫీచర్ ఆన్ ఉందో లేదో చూడాలంటే..
Phone Settings → General → Expressive Callingకి వెళ్లాలి. ఇది డిఫాల్ట్‌గా ఆన్‌లోనే ఉంటుంది. అవసరమైతే Do Not Disturb మోడ్‌లో ఉన్నా అత్యవసర కాల్ రావడానికి సెట్టింగ్ కూడా ఉంటుంది.
అత్యవసర కాల్స్ ఎలా చూపిస్తుంది?
ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రాథమిక దశలో ఉండటంతో, కాల్ చేసే వ్యక్తి, కాల్ తీసుకునే వ్యక్తి ఇద్దరూ Phone by Google బీటా వెర్షన్ (వెర్షన్ 203) ఉపయోగిస్తేనే ఇది పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కాల్ చేసే సమయంలో “ఈ కాల్‌ను అత్యవసరంగా మార్క్ చేయాలా?” అని ఒక ప్రాంప్ట్ కనిపిస్తుంది. యూజర్ అవును అని సెలెక్ట్ చేస్తే, కాల్ అందుకునే వ్యక్తి స్క్రీన్‌పై “It’s urgent!” అనే మెసేజ్‌తో పాటు యానిమేటెడ్ సైరన్ ఎమోజీ కనిపిస్తుంది. ఒకవేళ ఆ కాల్ మిస్ అయితే, కాల్ హిస్టరీలో కూడా దాన్ని ‘Urgent Call’ గా చూపిస్తుంది. దీంతో ముఖ్యమైన కాల్స్ మిస్ అయినా తర్వాత గుర్తించటం సులభమవుతుంది.
Gemini యాప్‌లో ‘Gemini 3 Deep Think’
ఇదిలా ఉండగా, గూగుల్ తన Gemini యాప్‌లో మరో పెద్ద అప్‌డేట్ తీసుకొచ్చింది. Gemini 3 Deep Think అనే కొత్త రీజనింగ్ మోడ్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇది Google AI Ultra ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ అయిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ముఖ్యంగా క్లిష్టమైన పనులు చేసే యూజర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. గణితం, సైన్స్, లాజికల్ రీజనింగ్ వంటి క్లిష్ట రంగాల్లో పనిచేసే వారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్ చెబుతోంది.
AI ఆలోచనా శక్తిలో భారీ మార్పు
డీప్ థింక్ మోడ్ ప్రత్యేకత ఏమిటంటే, ఒకే ప్రశ్నకు సంబంధించి ఒకేసారి ఎన్నో ఆలోచనా మార్గాల్లో (multiple reasoning paths) సమస్యను విశ్లేషిస్తుంది. దీని వల్ల క్లిష్టమైన సమస్యలకు మరింత లోతైన, ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వగలుగుతుంది.
గూగుల్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కొత్త మోడ్ పలు కఠినమైన AI బెంచ్‌మార్క్ టెస్టుల్లో అద్భుత ఫలితాలు సాధించింది. ఎలాంటి టూల్స్ ఉపయోగించకుండా Humanity’s Last Examలో 41 శాతం స్కోర్ సాధించిందని, కోడ్ ఎగ్జిక్యూషన్ ఉపయోగించినప్పుడు ARC-AGI-2 టెస్ట్‌లో 45.1 శాతం మార్కులు సాధించిందని కంపెనీ తెలిపింది. ఈ ఫలితాలు AI రీజనింగ్ సామర్థ్యంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్లుగా గూగుల్ పేర్కొంటోంది.

