Elon Musk: జీరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కమత్ నిర్వహించే ‘పీపుల్ బై WTF’ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో ఈసారి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. రెండు గంటలపాటు సాగిన ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో ఆయన మీడియా భవిష్యత్తు, ఏఐ ప్రయాణం, లైవ్ అనుభవాల విలువ వంటి పలు అంశాలపై తన స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ ఎపిసోడ్‌కు “ Elon Musk: A Different Conversation w/ Nikhil Kamath” అనే పేరు పెట్టారు.
ఏఐ రాబోయే రోజుల్లో సినిమాలు, గేమ్స్, పాడ్‌కాస్ట్‌లను పూర్తిగా మార్చేస్తుంది
కంటెంట్ భవిష్యత్తు గురించి ప్రశ్నించగా, మస్క్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాలంలో పెద్ద చర్చను రేపాయి. “సినిమాలు, మీడియా, పాడ్‌కాస్ట్‌లు… ఇవన్నీ భవిష్యత్తులో ఎక్కువగా ఏఐ చేతనే రూపొందించబడతాయి. రియల్‌టైమ్ వీడియో జనరేషన్, రియల్‌టైమ్ వీడియో గేమ్స్ ఇవి అసలు మన పరిశ్రమను తలకిందులు చేయబోతున్నాయి” అని ఆయన వెల్లడించారు. తన కంపెనీ xAI తయారుచేస్తున్న సాధనాలు సహా, ప్రస్తుత ఏఐ టూల్స్ మానవ అనుభవాలను అద్భుతంగా రీక్రియేట్ చేయగలవని మస్క్ స్పష్టం చేశారు. “ చాలా లోతైన భావోద్వేగాలు, దాచిన నొప్పులు, అనుభవాలు.. ఇవన్నీ ఏఐ ఇప్పుడు చాలా నిజంగా అనుకరించగలదని” అన్నారు.
లైవ్ ఈవెంట్స్ తిరిగి పుంజుకుంటున్నాయి.. ఎందుకు?
ఈ సంభాషణలో నిఖిల్ కమత్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. లైవ్ ఈవెంట్స్ మళ్లీ వేగంగా గ్రోత్ అవుతున్నాయనీ, ప్రజలు నిజమైన మానవ అనుభవాల వైపు మరింత ఆకర్షితులవుతున్నారని.. మస్క్ దీనిని పూర్తిగా అంగీకరించారు. “ డిజిటల్ కంటెంట్ ఎక్కువైపోతుంది, దాదాపు ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. అలాంటి వేళలో నిజమైన లైవ్ అనుభవాలు చాలా అరుదుగా మారతాయి. అందుకే వాటి విలువ పెరుగుతుంది” అని వ్యాఖ్యానించారు.
“ లైవ్ అనుభవాలు పెట్టుబడికి మంచి అవకాశం”.. మస్క్
లైవ్ ఈవెంట్స్ భవిష్యత్తులో పెద్ద పెట్టుబడి అవకాశంగా మారుతాయా? అనే ప్రశ్నకు మస్క్ వెంటనే “అవును” అన్నారు.
ఆన్‌లైన్ కంటెంట్ అంతులేని విధంగా పెరుగుతున్నప్పటికీ, లైవ్ అనుభవాలు మాత్రం స్కార్సిటీ వల్ల ప్రీమియమ్ విలువను కలిగి ఉంటాయని ఆయన వివరించారు. అంటే, కాన్సర్ట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, ప్రత్యేక ప్రదర్శనలు వంటి రంగాలు భవిష్యత్తులో భారీ గ్రోత్ అవకాశాలుగా ఉండొచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు.
మస్క్ కుమారుడి పేరులో ‘శేఖర్’.. భారత శాస్త్రవేత్తకు గౌరవం
ఈ ఎపిసోడ్ చివరలో మస్క్ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తనకు శివోన్ జిలిస్‌తో ఉన్న పిల్లల్లో ఒకరి పేరు ‘శేఖర్’ అని, అది భారతీయ ఖ్యాతి గాంచిన ఆస్ట్రోఫిజిసిస్ట్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్కు నివాళిగా పెట్టినదని చెప్పారు. ఈ విషయం విని నిఖిల్ కమత్ కూడా ఆశ్చర్యపోయాడు.
