ఐపీఎల్ విజేతగా నిలిచేనా..?
టైటిల్ ఆశల్లో హైదరాబాద్ ఫ్యాన్స్
అద్భుతంగా సన్ రైజర్స్ టీమ్..
IPL 2025 – SRH: గత సీజన్ ఐపీఎల్ లో ఆరెంజ్ ఆర్మీ ఏ రేంజిలో చెలరేగింది. భారీ స్కోర్లతో స్కోరుబోర్డును షేక్ చేసింది సన్ రైజర్స్ టీమ్.. ముంబయిపై 277/3.. 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులతో సత్తాచాటి..గతేడాది ఫైనల్ చేరినా.. రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఫైనల్ వరకు దూసుకొచ్చినా తుదిపోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. మెగా వేలంతో జట్టులో కొత్త ప్లేయర్లు చేరారు. బ్యాకప్ ప్లేయర్ల విషయంలో కొద్దిగా లోపాలు ఉన్నప్పటికీ… ఓవరాల్‌గా జట్టు సమతూకం బాగుంది. అన్నీ కలిసివస్తే… గత సీజన్‌లాగానే ఈ సారి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ఆటతీరును ప్రదర్శించడం ఖాయం.
ధనాధన్ ఆటకు పర్యాయపదంగా మారుతూ గతేడాది ఐపీఎల్ లో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్..ఈ సీజన్ లో ఎలాగైనా విజయం సాధించి ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో కనిపిస్తోంది. గత సంవత్సరం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనలతో తన సత్తా చాటింది. క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తూ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇక ఈ సీజన్ లో ఈ నెల 23 న రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన మొదటి మ్యాచ్‌ను ఆడనుంది. గతేడాది రన్నరప్ గా నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ఈ సారి తప్పక ఐపీఎల్ విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం.. 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తిరిగి సత్తా చాటుతుందో..? లేదో చూడాల్సిందే..
రిటైన్..
జట్టు లోని కీలక ప్లేయర్లు ప్యాట్ కమిన్స్, ట్రావిస్‌హెడ్, హెన్రిచ్ క్లాసిన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మను జట్టు సన్ రైజర్స్ యాజమాన్యం రిటైన్ చేసుకుంది. కాగా, ఈ ఏడాది కూడా ఆస్ట్రేలియా స్టీడ్ స్టర్ ప్యాట్ కమిన్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. 2018 అనంతరం ఐపీఎల్ లో సన్ రైజర్స్ టీమ్ అంతగా రాణించలేదు. కానీ గతేడాది ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను భారీ ధరకు దక్కించుకోవడం ఆ జట్టు దశ తిరిగేలా చేసింది. ఐపీఎల్ గత సీజన్ లో ఫైనల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ దూసుకొచ్చిందంటే దానికి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీనే కారణమంటే అతిశయోక్తి కాదు.
ఇక బౌలింగ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాటింగ్ లో హెన్రిచ్ క్లాసెన్ స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తాడు. జట్టు కీపింగ్ బాధ్యతలూ మోస్తాడు. ఇక స్థానిక ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా గత సీజన్ లో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. ఒక ఓపెనర్ ట్రావిస్ హెడ్ గత సీజన్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కండ్లు చెదిరే ఆరంభాలతో ఘన విజయాలు అందించాడు.
ట్రావిస్ హెడ్‌తో కలిసి అభిషేక్ శర్మ గత సీజన్‌లో పలు అద్భుత ఓపెనింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సన్ రైజర్స్ విజయాల్లో ఈ జోడీ కీలక పాత్ర పోషించింది. వీరికి తోడుగా మెగా వేలం అనంతరం జట్టులోకి ఇషాన్ కిషన్ కూడా వచ్చి చేరడంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ మరింత స్ట్రాంగ్ గా మారింది.
సమతూకంగా హైదరాబాద్
బ్యాటింగ్‌లోనే కాదు.. ఇటు బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లోనూ బలంగా ఉంది. భారత స్టార్ ప్లేయర్ మహమ్మద్ షమీ చేరికతో సన్‌రైజర్స్ టీం ఇతర జట్లను హడలెత్తించనుంది. మరోవైపు డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసే హర్షల్ పటేల్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అదనపు బలం కానున్నాడు. 2025 మెగావేలంలో దక్కించుకున్న ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా జట్టుకు దూరమైనా.. కార్స్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ ను రీప్లేస్ చేసుకున్నారు.
దీంతో జట్టు ఫాస్ట్ బౌలింగ్ మరింత పదునుగా మారింది. ఇక ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ రూపంలో స్పిన్ బౌలింగ్ లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో వైవిధ్యం కనిపిస్తోంది. అన్నీ కలిసివస్తే… గత సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయాలతో ముందంజ వేయనుంది. అభిలాష.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషాన్ అన్సారీ, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్‌జీత్ సింగ్, ఈషన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్, వియాన్ ముల్డర్, అథర్వ తైడే, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, అనికేత్ వర్మ.
Also Read: IPL 2025 – MI: ముంబై ‘ఆరే’స్తారా..?