భీకరంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్
మరో టైటిల్ వేటకు రెడీ అంటున్న పాండ్యా సేన
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లో అత్యంత ప్రతిభావంతమైన జట్టు.. స్టార్ ప్లేయర్లతో నిండిన జట్టు..అద్భుతమైన ఫ్యాన్ బేస్ కలిగిన జట్టు..ఈ జట్టులో అడుగు పెడితే చాలు..టీమిండియా తలుపు తట్టినట్లే.. అలాగే గతంలో రాయుడు తిరిగి టీమిండియా చేరాడు.బుమ్రా లాంటి స్టార్ పేసర్ వచ్చాడు. పాండ్యా లాంటి అద్భుత పేస్ ఆల్ రౌండర్ దొరికాడు. రోహిత్ లాంటి ట్రోఫీలు గెలిపించి పెట్టే కెప్టెన్ దొరికాడు. తిలక్ వర్మ, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ..ఇలా ఎందరో ముంబైలో మెరిసి..టీమిండియాలోకి వచ్చారు.
అందుకే ఈ జట్టంటే అందరికీ ఆకర్షణ.. ఐపీఎల్ లో 5 టైటిళ్ల విజేత ముంబై అవకాశాలు ఈసారి ఎలా ఉండనున్నాయి? మెగా వేలంతో జట్టు దశ మారనుందా..? మళ్లీ చాంపియన్ గా నిలుస్తుందా..? ఈ కథనంలో చూద్దాం.. మార్చి 23న చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది.
గత సీజన్ లో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం.గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యాను రప్పించి మరీ జట్టు కెప్టెన్ గా చేయడం..వారి కొంపముంచింది.జట్టు కెప్టెన్ గా రోహిత్ ను తప్పించడం ముంబై ఫ్యాన్స్ కు ఆగ్రహం కలిగించింది. దీంతో స్టేడియంలో సొంత జట్టుపై..అందునా పాండ్యాపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
2024 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ 10 వ స్ధానంలో నిలిచినా స్టార్ పేసర్ బుమ్రా మాత్రం 20 వికెట్లు తీసుకున్నాడు. కానీ జట్టుగా ముంబై ఫెయిలైంది. ఎందుకంటే జట్టులో రోహిత్ అనతరం కెప్టెన్ గా బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ఉండాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిని కాదని పాండ్యాను తీసుకురావడంతోనే జట్టు ఫెయిలైందని తెలుస్తోంది.
మరి ఇప్పుడు అంతా మారింది. టీ20 జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ విజయవంతంగా జట్టును నడిపిస్తున్నాడు. అతని ఫాం ఆందోళన కలిగిస్తున్నా..అచ్చివచ్చిన ఐపీఎల్ లో అతను చెలరేగి పోవచ్చు. ఇక బుమ్రా..గాయంతో ఆరంభ మ్యాచ్ లు ఆడలేకపోయినా.. టీ20 ప్రపంచకప్ తో పాటు ఇటీవలి కాలంలో అద్భుత బౌలింగ్ తో ప్రపంచ నంబర్ వన్ పేసర్ గా నిలిచాడు.
ఇక రోహిత్ శర్మ ..ఏడాది కాలంలోనూ టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. కెప్టెన్ గా జట్టుకు అద్భుత విజయాలను కట్టబెట్టాడు. ప్రస్తుత వన్డే, టీ20 ఫార్మాట్ లో టీమిండియా కెప్టెన్ మళ్లీ అద్భుత ఫాంలోకి వచ్చాడు. దీంతో ముంబై జట్టు ఈసారి మళ్లీ పేవరెట్ హోదాతో బరిలోకి దిగుతోంది. ఇప్పటివకే కెప్టెన్ ఎవరన్న దానిపై అన్ని అపోహలు దూరమైనట్లుగా ..ఎందుకంటే సూర్య కెప్టెన్సీలో టీ20 మ్యాచ్లు, రోహిత్ కెప్టెన్సీలో వన్డేలు ఆడుతున్న పాండ్యా ఇప్పడు జట్టును నిర్భయంగా నడిపేందుకు అవకాశం కనిపిస్తోంది.
ఐపీఎల్ లో ఘన చరిత్ర
తొలి మ్యాచ్ ల్లో ఓడిపోవడం.. అనంతరం పుంజుకోవడం.. చివరలో ధాటిగా ఆడి చాంపియన్ గా నిలవడం ముంబై స్టైల్.. ఆటలోనే కాదు టైటిల్స్ నెగ్గడంలోనూ వారి లెవలే వేరు. తొలి ఐదు సీజన్లలో ఒకేసారి ఫైనల్ చేరినా.. తర్వాతి 8 సీజన్లలో ఏకంగా 5 టైటిల్స్ దక్కించుకుంది. ఈ ఐదు ట్రోఫీలు రోహిత్ శర్మ సారథ్యంలోనే రావడం విశేషం.అయితే ఐపీఎల్ 2022 మెగా వేలం తర్వాత ముంబై ఆధిపత్యానికి బ్రేక్ పడింది. ఐపీఎల్ 2022, 2024 సీజన్‌లో అయితే పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానానికి పడిపోయిం. 2023లో మెరుగైన ప్రదర్శన చేసినా ప్లేఆఫ్స్‌కే పరిమితమైంది.
రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం ముంబై ఇండియన్స్ ఓటమికి కారణమైంది. అయినా హార్దిక్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కోర్ టీమ్‌ను అంటిపెట్టుకున్న ముంబై ఇండియన్స్.. వేలంలో జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. భారత స్టార్ ఆటగాళ్లతోనే ముంబైకి సగం బలం రాగా.. బలహీనతలను వేలంలో అధిగమించింది. దాంతోనే పేపర్‌పై చాలా భీకరంగా కనబడుతోంది.
ముంబై ఇండియన్స్ బలాలు..
బ్యాటింగ్ లో ఓపెనర్ గా భీకర షాట్లతో విరుచుకుపడే రోహిత్ శర్మ జట్టు పరిస్థితిని బట్టి గేర్ లు మార్చి ఆడే తిలక్ వర్మ, క్షణాల్లో మ్యాచ్ పరిస్థితిని మార్చేయగల సూర్యకుమార్ యాదవ్, ప్రపంచంలోనే అద్భుత ఫినిషర్ హార్దిక్ పాండ్యా, పేస్ బౌలింగ్ లో జస్‌ప్రీత్ బుమ్రాను వేలంలో రిటైన్ చేసుకుని కోర్ టీమ్ ను కొనసాగిస్తూనే … మెగా వేలంలో దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్‌లతో పాటు స్పెషలిస్ట్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ను కొనుగోలు చేశారు. అంతేకాదు టాపార్డర్ లో విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉండటం.. ముంబై బలాన్ని అమాంతం పెంచింది.
ముంబై ఇండియన్స్ బలహీనతలు..
భారత స్పిన్నర్లలో కేవలం వెటరన్ కర్ణ్ శర్మ మాత్రమే ఉండడం.. ఇక మిచెల్ సాంట్నర్‌కు ఐపీఎల్ ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడం మైనస్. ఇక జస్‌ప్రీత్ బుమ్రా ఎప్పుడు జట్టుతో చేరతాడో తెలియిన పరిస్థితి. అంతేకాదు విదేశీ ఆటగాళ్లలో జట్టుకు ప్రత్యామ్నాలు చాలా పరిమితంగా కనిపిస్తున్నారు. బ్యాకప్ గా భారత పేసర్లు, బ్యాటర్లు లేకపోవడం బలహీనత. ఫిట్‌నెస్ సమస్యలు
తుది జట్టు ఇలా..
విల్ జాక్స్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌లో ఆడనుండగా.. రాబిన్ మింజ్ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగనున్నాడు. సాంట్నర్ ఏడో స్థానంలో , దీపక్ చాహర్ ఎనిమిదిలో ఆడే అవకాశం ఉంది. బుమ్రా గైర్హాజరీలో ట్రెంట్ బౌల్ట్ పేస్ విభాగాన్ని నడిపించనున్నారు.
నమన్ ధీర్, కర్ణ్ శర్మ, లను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించవచ్చు. ర్యాన్ రికెల్టన్‌కు తుది జట్టులో అవకాశంవ్వాలనుకుంటే విల్ జాక్స్ మిడిలార్డర్‌లో ఆడనున్నాడు.
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
విల్ జాక్స్/ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాబిన్ మింజ్ (కీపర్), మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్,కార్బిన్ బాస్క్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: కర్ణ్ శర్మ, నమన్‌ధీర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్