గిల్ కెప్టెన్సీకి లిట్మస్ టెస్టు..
ట్రోఫీ కొడితే కెప్టెన్ రేసులో అతడే ఫస్టు..
GT IPL Trophy: ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తొలి అడుగే ఘనంగా పడింది. తొలి సీజన్లోనే అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. టైటిల్ గెలిచి సంచలనం సృష్టించింది. మూడేండ్ల ముందు హార్దిక్ పాండ్య నేతృత్వంలో ఆ జట్టు అద్భుతం చేసింది. అంతేకాదు.. వరుసగా ఆడిన రెండో సీజన్లోనూ ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచి అబ్బుర పరిచింది. కానీ హార్దిక్ గతేడాది ముంబైకి వెళ్లడంతో టైటాన్స్ వీకైంది. గతేడాది కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది.
శుభ్‌మన్ గిల్ బ్యాటర్‌గా సత్తా చాటినా.. కెప్టెన్‌గా జట్టును నడిపించడంలో సక్సెస్ కాలేకపోయాడు. కానీ ఈసారి మెగా వేలంలో ఈ జట్టు కథ మారింది. జోస్ బట్లర్ తో పాటు గ్లెన్ ఫిలిప్స్ సహా మేటి ఆటగాళ్లు చేరడంతో జిటి మళ్లీ బలంగా కనిపిస్తోంది. ఈ సీజన్ లో మేజిక్ చేసేలా కనిపిస్తోంది.
గుజరాత్ టైటాన్స్ జట్టులో గతంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా అదరగొట్టగా..ఆఫ్ఘానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అద్భుతం చేశాడు. హార్దిక్ పాండ్య సారథ్యంలో 2022 లో సమష్టిగా సత్తా చాటి టైటిల్ విజేతగా నిలవగా.. 2023 సీజన్ లోనూ ఫైనల్ చేరింది. హార్దిక్ జట్టును వీడిన అనంతరం గతేడాది 8వ స్థానానికి పరిమితమైంది.
మరి ఈసారి ప్లేఆఫ్స్ చేరాలన్న పట్టుదలతో ఆ జట్టు బరిలోకి దిగుతోంది. ఈ సీజన్ గిల్ కెప్టెన్సీకి కూడా కీలకం కానుంది. గిల్ టీమిండియా వన్డే జట్టు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. భవిష్యత్తులో జట్టును నడిపించే సత్తా ఉందని అందరూ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ట్రోఫీ అందుకుంటే కెప్టెన్ గా గిల్ తన స్థానం పదిలం చేసుకోవడం ఖాయమే.
బలం ఇలా..
ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన బౌలింగ్ విభాగాన్ని రెడీ చేసుకుంది. జట్టులోని స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను రిటైన్ చేసుకుంది. అంతేకాదు కగిసో రబాడ, గెరాల్డ్ కోయెట్జీ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ లను వేలంలో సొంతం చేసుకుని ఈమేరకు బౌలింగ్ విభాగంలో పటిష్ఠంగా మారింది. వీరి బౌలింగ్ యూనిట్ దాదాపు లీగ్ లోని మిగిలిన అన్ని జట్ల కంటే బలంగా కనిపిస్తోంది.
అంతేకాదు బ్యాటింగ్ లో గత సీజన్‌లో అత్యుత్తమంగా రాణించిన గిల్, సాయి సుదర్శన్ జోడీకి తోడుగా ఇంగ్లీష్ స్టార్ జోస్ బట్లర్ చేరిక మరింత బలం కానుంది. టాపార్డర్ లో వీరు ముగ్గురు చెలరేగితే టైటాన్స్ భారీ స్కోర్ సాధించడం ఖాయం. గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ లాంటి సూపర్ ఆల్ రౌండర్లు ఉండటం జీటీ బలాన్ని అమాంతం పెంచింది. పవర్‌ప్లేలోనూ బౌలింగ్ తో మేజిక్ చేసే సుందర్ కు తోడుగా .. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసే రషీద్ జీటీ స్పిన్ బౌలింగ్‌కు ప్రధాన ఆయుధాలు.
రాజస్థాన్ రాయల్స్‌కు ఎన్నో ఏళ్లుగా ఆడుతున్న జోస్ బట్లర్.. ఈసారి టైటాన్స్ సొంతమయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింట్లోనూ అదరగొట్టే గ్లెన్ ఫిలిప్స్ కూడా తోడయ్యాడు. గిల్, సాయి సుదర్శన్‌ల రూపంలో టైటాన్స్‌కు బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. తర్వాత బ్యాటింగ్‌లో బట్లర్, ఫిలిప్స్ కీలకం. స్పిన్‌లో రషీద్‌కు సాయికిశోర్, సుందర్ సహకారం అందించనున్నారు. సిరాజ్ అతడితో పాటు రబాడ, కొయెట్జీ, ప్రసిద్ధ్ కృష్ణ రూపంలో నాణ్యమైన పేసర్లు టైటాన్స్‌కు అందుబాటులో ఉన్నారు.
సరైన కెప్టెన్ లేడు..
హార్దిక్ వెళ్లిపోయాక నాయకత్వ సమస్య గుజరాత్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. తీవ్రమైన పోటీ ఉండే ఐపీఎల్‌లో సరైన వ్యూహాలతో జట్టును నడిపించాలి. కానీ శుభ్‌మన్ గిల్ ఈ విషయంలో ఫెయిలవుతున్నాడు. అంతేకాదు రషీద్ ఖాన్ ఫాం ఆందోళన కలిగిస్తోంది. అతను చాంపియన్స్ ట్రోఫీలోనూ రాణించలేకపోయాడు. ఇంగ్లాండ్ కెప్టెన్సీ వదిలేసిన బట్లర్.. ఐపీఎల్‌లో జిటీ తరఫున ఎలా రాణిస్తాడో చూడాల్సిందే. రషీద్ ఖాన్, బట్లర్ రాణింపుపైనే జిటి ముందంజ వేయనుంది
బలహీనతలు ఇవే..
బ్యాటింగ్‌లో గిల్, బట్లర్, సుదర్శన్‌పై అతిగా ఆధారపడటం ప్రధాన సమస్య. పేరున్న భారత బ్యాటర్ ఎవరూ లేకపోవడం పెద్ద మైనస్.. లోమ్రోర్, అనుజ్ , కుషాగ్ర లాంటి యువ ప్లేయర్లు ఎలా రాణిస్తారో తెలియదు. జట్టులో టాపార్డర్ పై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పేసర్లు ప్రసిధ్, ఇషాంత్, రబాడ ఎప్పుడు గాయపడుతారో తెలియదు.
గుజరాత్ టైటాన్స్ జట్టు
శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, షారూక్ ఖాన్, జోస్ బట్లర్, అనుజ్ రావత్, గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్, మహిపాల్ లోమ్రోర్, కుమార్ కుషాగ్ర, రబాడ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గెరాల్డ్ కోయెట్జీ, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కుల్వంత్ ఖెజ్రోలియా, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షెర్ఫానె రూధర్‌ఫోర్డ్, కరీమ్ జనాట్, నిశాంత్ సిందు, మానవ్ సుతార్, జయంత్ యాదవ్.
Also Read: KL Rahul: రాహుల్ ..ఢిల్లీకి చేరినా.!