Shaheen Afridi: మూలిగే నక్కపై తాటి పండు పడినట్లుగా.. అయింది పాకిస్థాన్ పేసర్ షహీన్ అఫ్రిది పరిస్థితి.చాంపియన్స్ ట్రోఫీలో ఒక్క విజయం సాధించలేకపోవడంతో పాకిస్థాన్ జట్టుపై ఇప్పటికే ఆగ్రహావేశాలు వ్యక్తమౌతుండగా.. ఇక న్యూజిలాండ్ లో టీ20 సిరీస్ ఆడుతున్న పాకిస్థాన్ ఆటతీరుతో వారి అభిమానులు ట్రోల్ చేస్తూ తాట తీస్తున్నారు. తొలి టీ20లో 91 పరుగులే చేసి ఘోరంగా ఓడిన పాకిస్థాన్ జట్టు ..రెండో టీ20లోనూ పరాజయం పాలైంది.
వర్షం రాకతో 15 ఓవర్లకు కుదించిన రెండో టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. సల్మాన్ ఆఘా 46 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. షాదాబ్ ఖాన్ (26), షహీన్ అఫ్రిది (22) రాణించారు. లక్ష్య ఛేదనలో సీఫెర్ట్ (45), ఫిన్ అలెన్ (38) చెలరేగడంతో 13.1 ఓవర్లలో 137 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిదికి.. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (Siefert) గట్టి షాకిచ్చాడు. తొలి ఓవర్ మెయిడెన్ తో హడలెత్తించినా.. తన రెండో ఓవర్లలో సీఫెర్ట్ దెబ్బకు అబ్బా అన్నాడు. మూడో ఓవర్ లో తొలి రెండు బంతులను సిక్సర్లు కొట్టిన కివీస్ ఓపెనర్.. ఆతర్వాత ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఈ ఓవర్ లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. ఈ సిక్సర్లలో ఒకటి 119 మీటర్ల సిక్సర్ కావడం మ్యాచ్ కే హైలైట్ గా మారింది.
అంతకముందు ఫిన్ అలెన్ కూడా మహమ్మద్ అలీ బౌలింగ్ లో మూడు సిక్సర్లు బాదాడు. దీంతో కేవలం రెండు ఓవర్లలోనే న్యూజిలాండ్ 44 పరుగులు చేసి మ్యాచ్ ను తమ వైపుకు తిప్పుకుంది. ఓపెనర్ల జోరుతో న్యూజిలాండ్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
ఇక ఈ మ్యాచ్‌లో షహీన్ బౌలింగ్ పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. వికెట్లు తీయకపోవడంతో పాటు సీఫెర్ట్ నాలుగు సిక్సర్లు బాదడంతో నెటిజనం అతన్ని ఆటాడుకుంటున్నారు.
షహీన్ అఫ్రిది బౌలింగ్ ..బాబర్ బ్యాటింగ్ కన్నా దారుణంగా ఉందని ఒకరు పోస్టు చేస్తే.. ఆట తక్కువ.. ప్రచారం ఎక్కువ అంటూ అఫ్రిదిని మరొకరు ఎద్దేవా చేస్తూ పోస్టు పెట్డడం విశేషం.. తక్షణం అన్ని ఫార్మాట్లలో అతన్ని జట్టు నుంచి తప్పించాలంటూ మరొకరు.. ఒక ఓవర్ అద్భుతంగా వేసి.. తర్వాత చెత్తగా బౌలింగ్ చేసే షహీన్ అఫ్రిది లాంటి బౌలర్ ను ఎప్పుడూ చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని బౌలింగ్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
చాంపియన్స్ ట్రోఫీ అనంతరం జరగుతున్న ఈ సిరీస్ లోనూ వరుస ఓటమిలతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ ఆడేందుకు కివీస్ టాప్ ప్లేయర్లు వెళ్లినా.. ద్వితీయ శ్రేణి కివీస్ జట్టులో పాకిస్థాన్ ఓడిపోవడంతో సామాజిక మాధ్యమాల్లో వీరిని ఏకి పడేస్తున్నారు.
Also read: KL Rahul: రాహుల్ ..ఢిల్లీకి చేరినా.!