Prithvi Shaw: యూట్యూబర్ సప్నాగిల్ తో క్రికెటర్ పృథ్వీ షాకు వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది ముంబయి సెషన్స్ కోర్టు విచారణ పరిధిలో ఉంది. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆసక్తికర పరిణామాం చేటుచేసుకుంది. సప్నా గిల్ వేసిన పిటిషన్ కు సమాధానం దాఖలు చేయకపోవడంతో రూ.100 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
అసలేం జరిగిందంటే?
క్రికెటర్ పృథ్వీ షా తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడంటూ.. సోషల్ మీడియా ఇన్ ఫ్యూయెన్సర్ ముంబయి సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ పై వివరణ ఇవ్వాలని గతంలో క్రికెటర్ పృథ్వీషాను కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకూ సమాధానం ఇవ్వకపోవడంతో జరిమానా విధించింది. విచారణ సందర్భంగా సెషన్స్ కోర్టు జడ్జి మాట్లాడుతూ ‘సెషన్స్ కోర్టు ఇప్పటికే పృథ్వీ షాకు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. గత విచారణలో హెచ్చరించినా పృథ్వీషా తన సమాధానాన్ని దాఖలు చేయలేదు. మరొక అవకాశం ఇస్తున్నాం. అదే సమయంలో చేసిన తప్పుకు రూ.100 ఫైన్ చెల్లించాలి’ అని పేర్కొన్నారు. తదపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. .
కేసు నేపథ్యం
2023 ఫిబ్రవరి 15న ముంబైలోని అంధేరి పబ్‌లో పృథ్వీషా, సప్నాగిల్ ఫ్రెండ్స్ మధ్య వివాదం తలెత్తింది. పోలీసుల కథనం ప్రకారం గిల్ స్నేహితుడు శోభిత్ ఠాకూర్.. రాత్రి 1 గంట ప్రాంతంలో షాతో సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. అయితే ఇందుకు షా నిరాకరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. తర్వాత షా తన స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్ తో కలిసి పబ్ నుంచి వెళ్తున్న క్రమంలో ఠాకూర్ బేస్ బాల్ బ్యాటుతో దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే షా మాత్రం దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
షా లైంగికంగా వేధించాడు: గిల్
క్రికెటర్ పృథ్వీ షా ఫిర్యాదుతో శోభిత్ ఠాకూర్, సప్నాగిల్ సహా ఆగురురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 17న గిల్ ను అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల తర్వాత బెయిల్ పై విడుదైలన సప్నాగిల్.. పృథ్వీషాపై సంచలన ఆరోపణలు చేశారు. పృథ్వీ షా, అతడి స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్ తమ వీఐపీ టేబుల్ వద్దకు వచ్చి డ్రింక్ ఆఫర్ చేశారని ఆరోపించారు. ఆ సమయంలో షా, యాదవ్ ఇద్దరూ కలిసి తన ఫ్రెండ్ ఠాకూర్ పై దాడి చేశారని ఆరోపించారు. తాను మధ్యవర్తిత్వం చేయాలని ప్రయత్నించినప్పుడు, షా తనపై శారీరకంగా, లైంగికంగా దాడి చేశారని గిల్ ఆరోపించారు. ఈ ఆరోపణల ఆధారంగా షాపై కేసు నమోదు చేయాలని ఆమె కౌంటర్ కంప్లైంట్ చేశారు.
Also Read: Shocking Incident: అందరూ చూస్తుండగానే.. కుప్పకూలిన స్వీడన్ ఆరోగ్య మంత్రి.. వీడియో వైరల్
ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరణ
క్రికెటర్ పృథ్వీ షాపై సప్నాగిల్ చేసిన ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించింది. పోలీసుల దర్యాప్తునకు మాత్రమే ఆదేశించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సప్నాగిల్.. 2024 ఏప్రిల్‌లో ముంబయి సెషన్స్ కోర్టును ఆశ్రయించి రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. తాజాగా పృథ్వీ షాకు రూ.100 జరిమానా విధించడంతో ఈ వివాదం మరోమారు చర్చకు వచ్చింది.