IPL 2025 Postponed: భారత్ – పాక్ యుద్ధం కారణంగా ఐపీఎల్ – 2025ను నిరవధికంగా వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రేక్షకులు, ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారిన తర్వాత తిరిగి ఐపీఎల్ ను నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఐపీఎల్ వాయిదా నిర్ణయానికి ముందు బీసీసీఐ (BCCI).. ఫ్రాంచైజీలు (IPL Franchise Owners), వాటాదారులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దేశంలోని ఉద్రిక్తత పరిస్థితులను వారికి వివరించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. విదేశీ ప్లేయర్లు సైతం ఐపీఎల్ లో ఆడుతున్న నేపథ్యంలో భద్రత విషయంలో రాజీపడటం ఏమాత్రం సబబు కాదని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ సూచించినట్లు తెలుస్తోంది. వారి పూర్తి అంగీకారం తర్వాత ఐపీఎల్ వాయిదాపై అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు సమాచారం.
కాగా గురువారం రాత్రి పాక్ దాడుల నేపథ్యంలో ధర్మశాలో జరుగుతున్న పంజాబ్ – ఢిల్లీ మధ్య మ్యాచ్ ను బీసీసీఐ అర్ధంతరంగా రద్దు చేసింది. బ్లాక్ ఔట్ కారణంగా గ్రౌండ్ లోని ఫ్లడ్ లైట్స్ ను ఆఫ్ చేశారు. తక్షణం స్టేడియం వీడి వెళ్లాలని సూచించారు. ఈ నెల 11న ధర్మశాలలో జరగాల్సిన ఇప్పటికే అహ్మదాబాద్ కు మార్చిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో నేటి ఐపీఎల్ మ్యాచ్ లు జరగవు.
Also Read: Civil War in Pakistan: పాక్‌లో అంతర్యుద్ధం.. రోడ్లపైకి ఇమ్రాన్ సపోర్టర్స్ .. తాటతీస్తున్న బలూచ్ రెబల్స్!
ఇదిలా ఉంటే IPL 2025 లో ఇప్పటివరకూ 57 మ్యాచ్‌లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఐపీఎల్ -2025 సీజన్లో ఇంకా 12 లీగ్ మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వాటితో పాటు రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం నాకౌట్ దశకు సంబంధించి తీవ్ర పోటీ నెలకొని ఉంది. అటు ఐపీఎల్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం మే25న కోల్ కతా వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉండగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సెంకండ్ పొజిషన్ లో ఉంది.