హార్దిక్ పై సస్పెన్షన్..బుమ్రా దూరం
IPL-Mumbai Indians: గత సీజన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఏదీ కలిసి రాలేదు. కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి ..హార్దిక్ ను కెప్టెన్ చేయడంతో మొదలైన రగడ.. సీజన్ ఆసాంతం కొనసాగింది. అంతేకాదు జట్టుకు వరుస పరాజయాలు.. సొంత ఫ్యాన్స్ ట్రోలింగ్ తో ముంబై జట్టు పూర్తిగా కుదేలైంది. వరుస పరాజయాలతో పాయింట్ల టేబులలో అట్టడుగున నిలిచింది.
తాజాగా ప్రస్తుత సీజన్ కు మెగా వేలంలో అద్భుతంగా జట్టును తీర్చిదిద్దుకున్నా.. వారికి మళ్లీ ఆరంభంలోనే పెద్ద ఝలక్ తగిలింది. ప్రారంభ మ్యాచ్ కు కెప్టెన్ హార్ధిక పాండ్యా దూరం కానున్నాడు. ఇంకా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పై క్లారిటీ లేదు.
Also Read- Virat Kohli – IPL: కింగ్ వచ్చేశాడు..
ఈ సీజన్ లో ఈ నెల 23వ తేదీన చెపాక్ లో ముంబై ఇండియన్స్ జట్టు ..చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీకొట్టనుంది. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ మూడు మ్యాచ్‌ల సందర్భంగా స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. దీంతో ఐపీఎల్ పాలక మండలి ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు రూ.30లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. గత సీజన్‌లో ముంబై గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో హార్దిక్‌పై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 సీజన్‌లో తొలి మ్యాచ్ నుంచి బయట కూర్చోవాల్సి వస్తుంది.
బుమ్రా దూరం..
కెప్టెన్ దూరమౌతున్నాడుకుంటుంటే జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతను బెంగళూరులోని ఎన్‌సీఏలో గాయం నుంచి కోలుకునేందుకు శ్రమిస్తున్నాడు. కాగా, బుమ్రా పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం అవసరమౌతుందని వార్తలు వెలువడుతున్నాయి. కాగా.. ఏప్రిల్‌లో బుమ్రా ముంబై జట్టుకు అందుబాటులోకి వస్తాడని సమాచారం. పూర్తి ఫిట్ నెస్ తో లేకుండా ఐపీఎల్ లో బుమ్రాను ఆడిస్తే.. రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు అతను దూరం కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ సిరీస్ కోసమే.. బుమ్రా ఫిట్ నెస్ ను, గాయాన్ని బిసిసిఐ పరిశీలిస్తోంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా అతను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే ఐపీఎల్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ అందనున్నట్లు తెలుస్తోంది. దీంతో ముంబై ఇండియన్స్ కు జస్ప్రీత్ బుమ్రా విషయంలో అసలు షాక్ ఎదురైంది. దీంతో మూలిగే నక్కపై తాడిపండు పడినట్లైంది ముంబై ఇండియన్స్ పరిస్థితి.
సారథిగా సూర్యనే..
తొలి మ్యాచ్‌లో హార్దిక్ ఆడకపోవడంతో ఐపీఎల్ లో చెన్నై తో జరిగే తొలి మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్.. ముంబై ఇండియన్స్ సారధిగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది జరిగిన పరిణామాలతో రోహిత్ కెప్టెన్సీ తీసుకునేందుకు నిరాకరించాడు. ముంబై టీమ్ మేనేజ్ మెంట్ కు తన అయిష్టతను ఇదివరకే తెలిపాడు. దీంతో టీమిండియా టీ20 సారథినే ముంబై జట్టును లీడ్ చేస్తాడన్నట్లుగా కథనాలు వస్తున్నాయి.