IPL 2025: ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) ముగియడంతో ప్రస్తుతం క్రికెట్ లవర్స్ దృష్టి ఐపీఎల్ (IPL 2025)పై పడింది. మార్చి 22 నుంచి ఈ క్రికెట్ పండగ మెుదలుకానుంది. ఇప్పటికే అన్నీ జట్లు నయా సీజన్ కోసం రెడీ అవుతున్నాయి. అటు ఐపీఎల్ నిర్వాహకులు సైతం ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ కు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. పలు యాడ్స్ ప్రదర్శించకుండా నిషేధం విధించింది.
ఐపీఎల్ నిర్వాహకులకు లేఖ
ఐపీఎల్ యాడ్స్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. మ్యాచ్ ల ప్రసార సమయంలో పొగాకు, మద్యం యాడ్స్ ను ప్రదర్శించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కు లేఖ పంపింది. ‘భారత యువతకు క్రికెట్ ఆటగాళ్లు ఎంతో ఆదర్శం. అటువంటి క్రికెట్ ఆటగాళ్లకు ఏ రకమైన పొగాకు లేదా మద్యం ప్రకటనలతో సంబంధం ఉండకూడదు. ఐపీఎల్ జరిగే క్రికెట్ స్టేడియాలు, లైవ్ ప్రసార సమయంలోనూ పొగాకు, మద్యం ప్రకటనలు ఇవ్వొద్దు. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి’ అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
సరోగసి యాడ్స్ పైనా నిషేధం
ఐపీఎల్ లో పొగాకు, మద్యంతో పాటు సరోగసి యాడ్స్ పైనా కేంద్రం నిషేధం విధించింది. ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు కూడా అటువంటి వాటిని ప్రమోట్ చేయకుండా అడ్డుకోవాలని సూచించింది. దేశంలో అతిపెద్ద క్రీడ సంబరమైన ఐపీఎల్ పై సామాజిక బాధ్యత కూడా ఉందని స్పష్టం చేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తులపై బ్యాన్ విధించాలని ఐపీఎల్ ఛైర్మన్ లో లేఖలో కోరింది.
Also Read: Rahul Gandhi: లోక్ సభలో ఓటర్ల జాబితా రగడ.. చర్చకు పట్టుబట్టిన రాహుల్
ఆర్థికంగా పెద్ద దెబ్బే
ఐపీఎల్ కు వచ్చే ప్రధాన ఆదాయ వనరుల్లో యాడ్స్ ముందు వరుసలో ఉంటాయి. దేశంలోని కోట్లాదిమంది యువత ఐపీఎల్ ను చూస్తుంటారు. ఈ నేపథ్యంలో వారిని అట్రాక్ట్ చేసేందుకు పలు మల్టీ నేషనల్ కంపెనీలు తమ ప్రాడెక్ట్స్ ను ఐపీఎల్ ద్వారా ప్రమోట్ చేసుకుంటూ ఉంటాయి. ఇందులో భాగంగానే సిగరేట్, మద్యం సరఫరా కంపెనీలు సైతం ఐపీఎల్ కు యాడ్స్ ఇస్తుంటాయి. కేంద్రం ఇచ్చిన తాజా ఉత్తర్వులతో ఐపీఎల్ పై ఆర్థికంగా ప్రభావం పడనుంది.