Telangana Jagruthi: మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి తెలంగాణ జాగృతి (Telangana Jagruthi)సిద్ధమైంది. జాగృతి క్యాడర్లో జోష్ నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సింహం గుర్తుతో బరిలోకి దిగుతున్నట్లు జాగృతి నేతలు తెలిపారు. అయితే, సింహం గుర్తుతో తొలిపోటీ చేస్తుండటంతో గులాబీ ఓటు బ్యాంకు చీలడంతో ఆ పార్టీ గెలుపోటములపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.
వ్యూహాత్మకంగా కవిత అడుగులు
రాష్ట్రంలో మున్సిపల్, పురపాలక సంఘం ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. పోటీకి సిద్ధమని ప్రకటించింది. అందుకు కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే జాగృతి జనం బాట యాత్ర పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటిస్తుంది. అన్ని వర్గాల ప్రజలతో పాటు యువత, ఉద్యమకారులు, మేధావులు, రాజకీయ వేత్తలతోనూ భేటీ అవుతున్నారు. అంతేకాదు స్థానిక సంస్థలపై అధ్యయనం చేస్తున్నారు. జాగృతి ఇప్పటి వరకు మహిళా సాధికారత, తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యమనే అంశాలపై ఉద్యమంగా పనిచేసింది. ఇప్పుడు అదే వేదికను రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే పోటీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ పార్టీని ప్రకటించకపోవడం, అప్పటికీ ఏ పార్టీతోనూ సంప్రదింపులు జరగకపోవటంతోనే దూరంగా ఉన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అయితే జాగృతి కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మున్సిపల్ స్థాయి నుంచి బలాన్ని పెంచుకొని, క్రమంగా స్థానిక సంస్థలన్నింటిలో పోటీ చేయాలన్నది జాగృతి అధినేత కవిత వ్యూహంగా కనిపిస్తోంది.
కొనసాగుతున్న కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
కవిత నూతన పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే పార్టీ ప్రకటించే లోగా మున్సిపల్, పురపాలక సంఘం ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు(ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు) పూర్తయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కవిత పోటీకి సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగానే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్బీ) నేతలతో సంప్రదింపులు చేశారు. ఒప్పందం కుదరడంతోనే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ పార్టీ గుర్తు సింహం కావడంతో ఆ గుర్తునుపైనే పోటీ చేస్తున్నారు. బలమైన, ధైర్యాన్ని సూచించే గుర్తుగా ‘సింహం’ను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా జాగృతికి గుర్తింపు వస్తుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. అలాగే పార్టీ గుర్తు సమస్య లేకుండా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కూడా కలుగుతుందని అందుకే ఈ గుర్తును కవిత ఎంచుకున్నట్లు జాగృతి వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే గ్రామల్లోకి వెళ్లిన జాగృతి
మహిళా ఓటర్లలో జాగృతికి ఉన్న ఇమేజ్, కవిత వ్యక్తిగత రాజకీయ ప్రస్థానం.. ఈ రెండూ కలిసి స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని జాగృతి నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే జాగృతి సంస్థ గ్రామస్థాయిలోకి వెళ్లింది. జాగృతి పోటీచేసి గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను తయారు చేయాలనే సంకల్పంతోనే పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కేవలం జాగృతి సంస్థగానే పనిచేసింది. అయితే ప్రజల్లోని ఆదరాభిమానాలను పార్టీగా మలుచుకోవాలని, తన ప్రభావం మున్సిపల్, స్థానిక సంస్థల నుంచే ప్రారంభించి సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది. కవిత పోటీ నిర్ణయంతో జాగృతి క్యాడర్లో మాత్రం జోష్ నెలకొంది. పలువురు పోటీకి సిద్ధమవుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం కావాలంటే ఈ ఎన్నికల్లో పోటీ అనివార్యమని భావించే కవిత రంగంలోకి దిగినట్లు సమాచారం.
గులాబీ గెలుపోటములపై ప్రభావం?
కవిత రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో పోటీకి సిద్దమవుతున్నారు. అదే విధంగా స్థానిక సంస్థల్లోనూ పోటీచేయాలని అందుకు కసరత్తును ప్రారంభించింది. జాగృతి నేతలతో సమావేశం అయి వారి అభిప్రాయం మేరకు పోటీకి సిద్ధమైనట్లు సమాచారం. అయితే, అన్ని మున్సిపాలిటీల్లోనూ కవిత జాగృతి కమిటీలు ఉన్నాయి. గులాబీ పార్టీలోనూ కొంతమంది అనుచరులు ఉన్నారు. అయితే, ఆమె పార్టీకి రాజీనామా చేసిన తర్వాత గులాబీలోని ఆమె అనుచరుల్లో స్తబ్దుగా ఉన్నారు. ఈ తరుణంలో కవిత పోటీతో ఆమెకు సహకరించే అవకాశాలు ఉన్నాయి. దీంతో గులాబీకి ఓట్లు చీలే అవకాశం లేకపోలేదు. అంతేకాదు మహిళలకు ఆమెపై సానుభూతి సైతం ఉండటంతో కలిసి వచ్చే అవకాశం ఉందని జాగృతి నేతలు అభిప్రాయపడుతున్నారు. కవిత పోటీతో గులాబీ పార్టీ గెలుపోటములపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఆపార్టీ నేతలు పోటీ ప్రకటన తర్వాత మల్లగుల్లాలు పడుతున్నారు. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలనుకున్న గులాబీ పార్టీకి కవిత గండికొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ జాగృతి అధినేత కవిత ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది. ‘సింహం’ గుర్తుతో ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫలితాలు కవిత రాజకీయ భవిష్యత్‌పై ఆధారపడబోతుందని రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.
Also Read: Telangana Jagruthi Kavitha: ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా.. హరీశ్ రావుపై మరోమారు మాటల తూటాలు

