Alleti Maheshwar Reddy: తెలంగాణ శాసనసభ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ అనుసరిస్తున్న తీరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం ఈ మేరకు ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించిన విషయాన్ని ఏలేటి గుర్తు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు చేరి ఏడాదిన్నర దాటుతున్నా ఇప్పటివరకు ఎందుకు కాలయాపన చేశారు? ఎల్లుండి లోపు తీర్పు వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించడంతోనే నేడు తూతూమంత్రంగా నిర్ణయాలు ప్రకటించారు.
Also Read: Alleti Maheshwar Reddy: రూ.6.29 లక్షల కోట్ల కుంభకోణం.. ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి సంచలన ఆరోపణలు
మిగిలిన వారి పరిస్థితి ఏమిటి?
ఎమ్మెల్యే వెంకటరావు విషయంలో మాత్రమే ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? దానం నాగేందర్, కడియం శ్రీహరిల పార్టీ ఫిరాయింపులపై ఎందుకు తీర్పు ఇవ్వలేదు? ఏడుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చి యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్‌ల తీర్పును ఎందుకు పెండింగ్‌లో పెట్టారు? ఇలా కొందరిపై తీర్పు ఇచ్చి, మరికొందరిని పెండింగ్‌లో ఉంచడం వెనుక ఉన్న మర్మమేంటి? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకరే ఈ రకంగా నిబంధనలను ఉల్లంఘించడం సరికాదు. కేవలం కాలయాపన చేసి రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. దీనిపై స్పీకర్ సమాధానం చెప్పాలి’ అని ఏలేటి డిమాండ్ చేశారు.
Also Read: Alleti Maheshwar Reddy: కార్మికుల సొమ్ముతో మెస్సీ మ్యాచ్? బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

