Alleti Maheshwar Reddy: హైదరాబాద్ సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ కు సింగరేణి సంస్థ నిధులు కేటాయించడంపై బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ఈనేపథ్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో వారు కార్యాలయం ఎదుట కూర్చుని నిరసనకు దిగారు. అనంతరం పోలీసులు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన్ను బీజేపీ రాష్ట్ర కార్యాలానికి తరలించారు.
ఫుట్ బాల్ కు ఎలా కేటాయిస్తారు
ఈ సందర్భంగా ఏలేటి మాట్లాడుతూ సింగరేణి సంస్థ డబ్బులు ప్రజాధనమని, దీన్ని ఫుట్ బాల్ కు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకోవడం కాంగ్రెస్ నిరంకుశ పాలనకు నిదర్శనమని ఫైరయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడానికి ప్రభుత్వం రూ.ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోందో, ఏ యో శాఖల నుంచి ఖర్చు చేస్తోందో, ఎందుకు ఖర్చు చేస్తోందో సర్కార్ వివరణ ఇవ్వాలని ఏలేటి డిమాండ్ చేశారు. ఈ మ్యాచ్ కు సింగరేణి పెట్టిన ఖర్చుతో క్రీడాకారులను ప్రోత్సహించడానికి లేదంటే కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయవచ్చు కదా అని ప్రశ్నించారు.
విమాన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది
మెస్సీకి ఇచ్చే మొత్తంతోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందికి వసతి, విమాన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోందని, అంతా కలిపి రూ.వంద కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపించారు. సింగరేణి, పర్యాటక, క్రీడల శాఖల నుంచి నిధులను మెస్సీ టూర్ కు మళ్లించినట్టు సమాచారం ఉందని ఏలేటి వివరించారు. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ గ్రౌండును ఫుట్ బాల్ గ్రౌండుగా మార్చాలని, మ్యాచ్ ముగిశాక మళ్లీ దాన్ని క్రికెట్ గ్రౌండ్ గా మార్చాల్సి ఉందన్నారు. దీనికి రూ.10 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిపారు.

