Sabitha Indra Reddy: స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కనిపించడం లేదని , నిర్వహిస్తే పంచాయతీలు , పరిషత్ ల మీద గులాబీ జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి , మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అన్నారు. శంషాబాద్ లోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అద్యక్షతన ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల పేరిట గడిచిన 22 నెలలుగా నాటకాలాడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదట్లోనే ఎందుకు జిఓ జారీ చేయలేదని ఆమె నిలదీశారు.
Also Read:Ramchander Rao: బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానం స్టే ఇవ్వలేదు.. రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు
22 నెలలు కాలయాపన చేసిన ప్రభుత్వం
కామారెడ్డి బిసి డిక్లరేషన్ పేరిట అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా వారిని నిలువునా వంచించారని మండిపడ్డారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించితే రాజ్యాంగబద్ధంగా చర్యలు చేపట్టవలసిందని అన్నారు. జిఓ జారీ చేయడం కేవలం కాలయాపనకోసమేనని ఆమె విమర్శించారు. బిసి రిజర్వేషన్లకు అసెంబ్లీ తీర్మానం, గవర్నర్ ఆమోదం, కేంద్ర ఆమోదం దానికోసం ఢిల్లీలో ధర్నా తదితర నాటకాలతో 22 నెలలు కాలయాపన చేసిన ప్రభుత్వం చివరగా మోసపూరిత జిఓ జారీ చేసి మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వాస్తవాలను గమనించలేనంత అమాయకంగా ప్రజలు లేరని, సమయానుకూలంగా మోసకారి కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఏ రిజర్వేషన్లు వచ్చినా సిద్ధంగా ఉండాలి
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం బీఆర్ఎస్ పార్టీదేనని , ఏ రిజర్వేషన్లు వచ్చినా సిద్ధంగా ఉండాలని క్యాడర్ కు సూచించారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు , 420 హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్నదని దానిని ఎండగడుతూ ఇంటికి ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీలు, కాంగ్రెస్ బాకీలు వివరిస్తూ దసరా పండుగకు ఇంటింటికి కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్టు వివరించారు.
ఈ కార్యక్రమంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి , క్యామ మల్లేశ్ , జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, డిసియంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, ఎస్సీ కమీషన్ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్సింహ్మ , మాజీ జడ్పీటీసీలు పట్నం అవినాష్ రెడ్డి , బూర్కుంట సతీష్ , రమేశ్ గౌడ్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు నర్సింగ్ రావు , నారాయణరెడ్డి , సీనియర్ నాయకులు దేశమోల్ల ఆంజనేయులు, కార్మిక నాయకులు పి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Also Read:Hyderabad-Vijayawada: హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం 2 గంటలే: మంత్రి కోమటి రెడ్డి