Harish Rao: ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్ జీగా మార్చడం అత్యంత ఆక్షేపణీయం అని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త బిల్లు కేవలం ఒక పేరు మార్పు మాత్రమే కాదని ఇది దేశ సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టారు. పథకంలో 60:40 నిధుల నిష్పత్తిని తెరపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచాలని చూస్తోందని విమర్శించారు.
బీజేపీ చర్యలకు లోపాయికారీగా మద్దతు ఇస్తోంది
ఈ నిబంధన వల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఇది పేదలకు పని కల్పించే పథకాన్ని దెబ్బతీయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అధికారాలను తగ్గిస్తూ కేంద్రం తన పెత్తనాన్ని పెంచుకోవడానికి ఈ బిల్లును ఒక ఆయుధంగా వాడుకుంటోందని, ఇది రాజ్యాంగం కల్పించిన రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాలరాయడమేనని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ కీలక విషయంలో కాంగ్రెస్ పార్టీ వహిస్తున్న మౌనాన్ని తప్పుబట్టారు. 60:40 నిష్పత్తి వల్ల రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించకుండా కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న కపటత్వాన్ని ఆయన ఎండగట్టారు. బయట సమాఖ్య వ్యవస్థ గురించి, రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్.. పార్లమెంట్ లోపల మాత్రం రాష్ట్రాలను బలహీనపరిచే బీజేపీ చర్యలకు లోపాయికారీగా మద్దతు ఇస్తోందని అన్నారు.
Also Read: Harish Rao: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకులు : మాజీ మంత్రి హరీశ్ రావు
ఈ బిల్లు ద్వారా మరోసారి స్పష్టమైంది
అధికార కేంద్రీకరణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకే నాణేనికి రెండు ముఖాలు అని ఈ బిల్లు ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు. నిరుపేదలకు పని కల్పించే ఈ పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ దీనిని సంస్కరణగా చిత్రీకరించడం హాస్యాస్పదమని హరీష్ రావు పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ సమాఖ్య స్ఫూర్తిపై జరుగుతున్న దాడి అని రాష్ట్రాలను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టే ఏ నిర్ణయమైనా దేశాభివృద్ధికి విఘాతమని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని దాని మౌలిక స్వరూపం దెబ్బతినకుండా కాపాడాలని, గాంధీ పేరును యధావిధిగా కొనసాగిస్తూ రాష్ట్రాల హక్కులను గౌరవించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Also Read: Harish Rao: మా సర్పంచ్‌లను బెదిరిస్తే.. వడ్డీతో సహా తిరిగిస్తా.. హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్

