CM Revanth Reddy: మార్పు దిశగా ప్రజా ప్రభుత్వం అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి గ్యారంటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారం చేపట్టిన రోజు నుంచే రైతులు, మహిళలు, నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలబడే గ్యారంటీలను అమలు చేయటంలో తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రజల సమక్షంలోనే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే కొత్త ఒరవడి అమలు చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రెండుసార్లు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించింది. ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో రెండుసార్లు గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించారు. సంక్షేమ పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించింది.
మహిళలకు వరం.. ఉచిత ప్రయాణం
ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని మహిళలు, ఆడబిడ్డలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సగటున రోజుకు ఏకంగా 34.32 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నాటికి రూ.8402 కోట్లు మహిళలు ఆదా చేసుకున్నారు. చదువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లే బాలికలకు ఈ పథకం ఎంతో ఊరటనిచ్చింది. బాలికల స్కూల్, కాలేజీల్లో డ్రాప్ అవుట్ అయ్యే శాతాన్ని తగ్గించింది. ఉపాధి కోసం ఊర్లు దాటి వెళితే సగం జీతం బస్ ఛార్జీలకే పోతుందనుకునే సగటు మహిళకు ఫ్రీ బస్ పథకం వెన్ను దన్నుగా నిలిచింది. రోజువారీగా పనులకు వెళ్లి సంపాదించుకునే మహిళలకు డబ్బులు ఆదా చేసుకుంటున్నారు. పని చేసుకునే మహిళల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
గ్యాస్ బండ భారం నుంచి విముక్తి
పేదింటి మహిళలకు గ్యాస్ ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ పథకాన్ని ప్రారంభించింది. రూ.500 లకే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నది. మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 42.90 లక్షల కుటుంబాలు గ్యాస్ సబ్సిడీతో లబ్ధి పొందుతున్నారు. వీరి పేరిట చెల్లించాల్సిన దాదాపు రూ.700 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తోంది. మరోవైపు, అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్‌ను అందించే గృహ జ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 200 యూనిట్ల లోపు విద్యుత్తు వాడే గృహ వినియోగదారులందరికీ జీరో బిల్లులు జారీ చేసింది. దీంతో దాదాపు 52.28 లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.3438 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసింది.
Also Read: CM Revanth Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి
రైతు భరోసా పెట్టుబడి సాయం
రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి భారీ పథకాలు అమలు చేసింది. ఎకరానికి రూ.12 వేల చొప్పున రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు 69,86,548 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది. ఈ ఏడాది వానాకాలం పంటలకు రికార్డు వేగంతో రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా కేవలం 9 రోజుల్లోనే రూ.8744 కోట్లు జమ చేసింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12వేలు ఆర్థిక సహాయం అందించే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద, లబ్ధిదారుల ఖాతాల్లో రెండు విడుతల్లో రూ.6వేలు చొప్పున డబ్బు జమ చేసింది. 2025 జనవరి 26 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. సన్న ధాన్యం పండించే రైతులను ప్రోత్సహించేందుకు ప్రతి క్వింటాల్‌కు రూ.500 అదనంగా బోనస్ రూపంలో ప్రభుత్వం అందిస్తున్నది. అంతేగాక రైతులకు ఒకేసారి రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేసింది. ఏకంగా 25.35 లక్షల మంది రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది.
ఇందిరమ్మ ఇండ్లు
రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లలోకి గృహ ఈ పథకం ద్వారా ఈ ఏడాది ప్రతి శాసనసభా నియోజకవర్గానికి 3,500 చొప్పున రూ.22,500 కోట్లతో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇండ్లకు రూ.3,200 కోట్లకు పైగా నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. ఏళ్ల తరబడి అడవుల్లో ఉంటూ గూడు సరిగాలేని ఐటీడీఏల్లోనూ ఇందిరమ్మ సొంతింటి కలలు నెరవేరాయి. చెంచులు నివసించే ఉట్నూరు, భద్రాచలం, మున్ననూర్, ఏటూరు నాగారంలోని నాలుగు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థల పరిధిలోని 10 వేల మంది చెంచులకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడం చారిత్రాత్మక నిర్ణయం.
10 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంపు
ప్రజా ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకు సంకల్పించింది. ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచింది. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ధైర్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకుంటున్నాయి. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా గుర్తించిన 1835 రకాల జబ్బులకు వైద్యం చేయించుకునే వెసులబాటు ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం 78 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి ప్రభుత్వం రూ.15600 కోట్ల బడ్జెట్ కేటాయించింది.

