Congress vs BJP: సీనియర్ కాంగ్రెస్ నేత డీఎస్ విగ్రహావిష్కరణపై కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫైట్ కొనసాగుతున్నది. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో విగ్రహావిష్కరణ చేయించడం వివాదానికి కారణమైనది. స్వయంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌లు బీజేపీపై ఫైర్ అయ్యారు. దివంగత కాంగ్రెస్ నేత డీ. శ్రీనివాస్ జీవితాంతం సెక్యులరిస్టుగా ఉన్నారని, అలాంటి నేత విగ్రహాన్ని బీజేపీ నాయకుడితో ఓపెన్ చేయించడం ఏమిటీ? అంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ సిద్ధాంతాలను డీఎస్ ఎన్నడూ ఒప్పుకోలేదని, ఆ పార్టీ విధానాలను అంగీకరించలేదని వివరించారు. కానీ, రాజాకీయ స్వలాభాల కోసం బీజేపీ నాయకుడితో విగ్రహావిష్కరణ చేయించడంతో ఆయన ఆత్మ క్షోభిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
బీజేపీ దిగజారుడు రాజకీయాలు
డీఎస్ విగ్రహానికి స్థలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, కనీసం కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వంలోని పెద్దలను ఎవరిని ఆహ్వానించకపోవడం దారుణమని పీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు. బీజేపీలో ఏనాడూ లేని డీఎస్ విగ్రహాన్ని అమిత్ షా ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం దారుణమన్నారు. కరుడు కట్టిన కాంగ్రెస్ వాది విగ్రహాన్ని కాషాయపు నేతతో లాంచ్ చేయించి కలుషితం చేశారని పీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు నూకలు చెల్లాయని, కుట్ర రాజకీయాలు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని పీసీసీ తనదైన శైలీలో విమర్శించారు. ఈ విగ్రహావిష్కరణపై కూడా వివిధ పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. కొందరు విమర్శలు చేసుకుంటున్నారు. మరి కొందరు తమ నేత అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.
రెండు పార్టీల మధ్య వార్
నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీనియర్ నేత డీఎస్ విగ్రహావిష్కరణ చేయడం సంచలనాత్మకమైంది. కరుడు కట్టిన కాంగ్రెస్ వాది విగ్రహం ఓపెన్ చేయడం పై రెండు పార్టీల నేతలు పరస్పర విమర్శలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీఎస్ తన రాజకీయం కాంగ్రెస్ జెండాతోనే ముగించాలని, ఆరోగ్యం సహకరించకున్నా, చివరి రోజుల్లో నేరుగా గాంధీభవన్‌కు వెళ్లి డీఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగగా, స్వల్ప వ్యవధి కాలం మాత్రం అనివార్య పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌లో కొనసాగాల్సి వచ్చిందని గతంలో ఆయనే ప్రకటించారు. కానీ, బీజేపీతో ఎన్నడూ టచ్‌లో లేరు.
Also Read: BRS Party Membership: గులాబీలో ఒకటే సస్పెన్స్.. నాలుగేళ్లుగా క్లారిటీ మిస్సింగ్.. కన్ఫ్యూజన్‌లో క్యాడర్!
కాంగ్రెస్ జెండా కప్పి అంత్యక్రియలు
డీఎస్ రెండో కుమారుడు బీజేపీ కావడంతో ఆయన విగ్రహావిష్కరణ అమిత్ షాతో చేయించారు. ఈ అంశం రెండు పార్టీల మధ్య వార్‌ను క్రియేట్ చేసింది. ఇక గతంలో డీఎస్ భౌతికకాయంపై కాంగ్రెస్ జెండా కప్పి అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. కాంగ్రెస్ సాంప్రదాయం ప్రకారం ముఖ్యనేతలు మరణిస్తే పార్టీ జెండా కప్పి అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు నిర్వహించింది. అయితే, ఈ వివాదంపై ఎంపీ అర్వింద్ ఇప్పటి వరకు స్పందించలేదు. అమిత్ షా పర్యటన తర్వాత రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు బీజేపీలోని నేతలు చెబుతున్నారు.