Pension
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Telangana Pension: పెన్షన్ జాబితాలో చిత్ర విచిత్రాలు.. స్వేచ్ఛ ఎక్స్‌క్లూజివ్

  • పర్యవేక్షణ లోపం.. ఇష్టారీతిన పథకం
  • నిబంధనలు గాలికి.. ఇష్టారాజ్యంగా పంపిణీ
  • మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా గ్రామం పేరు మీదే పెన్షన్
  • జంట అయిన ఒంటరి మహిళలకూ అందుతున్న నగదు
  • ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకూ జమ
  • దళారుల సృష్టితో నకిలీ దివ్యాంగులకు లబ్ధి
  • అర్హత ఉన్నా అందుకోలేక కొందరి దుస్థితి
  • రాష్ట్రంలో పింఛన్ అవకతవకలపై ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

పబ్బు సతీష్


వరంగల్, స్వేచ్ఛ

Telangana Pension: రాష్ట్రంలో అధికారుల తీరు గొంగడి నాది కాదు చెప్పులు నావి కావు అన్న చందంగా మారింది. పెన్షన్ మంజూరులో అనేక అవకతవకలు జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మృతుల అకౌంట్స్‌లో పెన్షన్ డబ్బులు జమ చేస్తూ కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయి. ఈ విషయాన్ని ‘స్వేచ్ఛ’ వెలుగులోకి తెచ్చింది. మరోపక్క అధికారుల పర్యవేక్షణ లోపంతో అనేక మంది అనర్హులు చేయూత పథకం ద్వారా పెన్షన్ పొందుతున్నారు. పెన్షన్ పంపిణీలో అనేక అవకతవకలు చోటు చేసుకుని అనర్హులు దర్జాగా పెన్షన్ పొందుతుండగా ఆరు సంవత్సరాలుగా అనేక మంది అర్హులు దరఖాస్తు చేసుకుని పెన్షన్ రాక, ఏ చేయూత లేక అవస్థలు పడుతున్నారు.


గ్రామం పేరు మీద పెన్షన్

ప్రతి నెలా వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు, గీత, నేత, బీడీ కార్మికులకు, హెచ్ఐవీ బాధితులకు గత ప్రభుత్వం ఆసరా పథకం పేరుతో పెన్షన్ ఇవ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం పేరుతో అందిస్తున్నది. అయితే మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట (సన్నాఫ్ హచ్య)లో గ్రామం పేరుమీద చేయూత పెన్షన్ మంజూరు అవుతున్నది. గ్రామం పేరుమీద జాబితాలో పేరు ఉండడంపై ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఆ డబ్బులు ఎవరు జేబులోకి వెళుతున్నాయో తెలియడం లేదని స్థానికులు పేర్కొన్నారు. అంతేకాదు, నరసింహులు పేట గ్రామంలోని పెన్షన్ లబ్ధిదారుల జాబితాలో పెద్ద నాగారం, పడమటి గూడెం, కొమ్మల వంచ, కౌసల్యాదేవిపల్లి, వంతడుపుల గ్రామాలకు చెందిన 67 మంది పేర్లు ఉన్నాయి. వీరు వారి గ్రామాల్లోనూ పెన్షన్ పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ఆయా గ్రామాల్లో 15 మంది మృతుల ఖాతాల్లో 16 నెలల నుంచి పెన్షన్ జమ అవుతున్నది. ఇదే మండలంలో అనేక మంది అనర్హులు పెన్షన్ పొందుతున్నారు. 20 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగస్థుల తల్లిదండ్రులు పెన్షన్ తీసుకుంటున్నారు. 50 మందికి పైగా ఈ మండలంతో సంబంధం లేని వారు చేయూత పెన్షన్ పొందుతున్నారని స్థానికులు అంటున్నారు. ఇలా రాష్ట్రంలోని అనేక మంది అనర్హులు పెన్షన్ పొందుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

జంటగా ఉన్నా ఒంటరి మహిళ పెన్షన్

ఏ ఆధారం లేకుండా భర్త చనిపోయిన, వదిలేసిన ఒంటరి మహిళలకు ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం చేయూత పథకంలో భాగంగా నెలకు రూ.2016 అందిస్తున్నది. హనుమకొండ జిల్లాలోని పలు గ్రామాల్లో అనేక మంది ఒంటరి మహిళ పెన్షన్‌కు ఎంపికైన తర్వాత తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకుని భర్తతో జంటగా జీవిస్తూ కూడా డబ్బులు తీసుకుంటున్నారు. జిల్లాలోని పెద్ద మండలంలో సుమారు 50 మంది ఇలా పెన్షన్ తీసుకుంటున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు.

Read Also- KTR: హోం మంత్రి అమిత్ షాకు కేటీఆర్ సూటి ప్రశ్నలు.. బదులిచ్చేదెవరు?

ఫేక్ సదరన్‌తో దివ్యాంగుల పెన్షన్

రాష్ట్రంలో చేయూత పథకం కింద దివ్యాంగులకు ప్రభుత్వం నెలకు రూ.4016 అందిస్తున్నది. దీన్ని ప్రజా ప్రభుత్వం రూ.6 వేలకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే, అనేకమంది అంగవైకల్యం లేకుండా స్వల్పంగా ఉన్నా దళారులతో కుమ్మక్కై తప్పుడు ఫేక్ సదరన్ పత్రాలు సృష్టించి దర్జాగా పెన్షన్ పొందుతున్నారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపెల్లి మండలంలో ఫేక్ సదరన్ సర్టిఫికెట్లు సృష్టించి అనేక మంది పెన్షన్ పొందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.

ఆరేళ్లుగా లక్షలాది మంది ఎదురు చూపులు

ఒకవైపు అనేకమంది అనర్హులు దర్జాగా పెన్షన్ పొందుతుండగా ఆరు సంవత్సరాలుగా కొత్త పెన్షన్ మంజూరీ లేక అనేక మంది అర్హులు అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2021లో హుజురాబాద్ నియోజకవర్గంలో కొత్తగా కొన్ని పెన్షన్లు మంజూరు చేశారు. తర్వాత దాని ఊసేలేదు. పింఛన్ పొందే భర్తలు మరణించిన తరువాత వారి స్థానంలో వితంతు పెన్షన్ వారి భార్యలకు ఇచ్చారు. అది కూడా రెండు సంవత్సరాలుగా ఇవ్వడం లేదు. మృతి చెందిన వారి పేరు మీద పెన్షన్ రద్దు చేసి వితంతు పెన్షన్ మంజూరు చేయలేదు. ఇక ఆరు సంవత్సరాలుగా మిగతా పెన్షన్ల మంజూరీ కూడా ఆగిపోయింది. దీంతో సుమారు 20 లక్షలకు పైగా దరఖాస్తుదారులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Read Also- Sand Mafia: సాండ్ అక్రమాలకు ఇవిగో సాక్ష్యాలు

అర్హత ఉన్నా ఎదురు చూపులే..

అనేకమంది అనర్హులకు పెన్షన్ అందిస్తున్న అధికారులు అర్హులైన వారికి మొండి చేయి చూపుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన మౌటం భిక్షపతి పూర్తిగా దివ్యాంగుడు. 20 ఏండ్లుగా వికలాంగుల పెన్షన్ పొందుతున్నాడు. అధికారుల తప్పిదం కారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 సంవత్సరాల క్రితం పెన్షన్ రద్దు అయ్యింది. ఎందుకు అని అడిగితే మళ్ళీ సదరన్ సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పారు. అది తీసుకుని మళ్ళీ దరఖాస్తు చేసుకుని కార్యాలయల చుట్టూ తిరుతుతున్నా మంజూరు చేయడం లేదు.

భర్త పెన్షన్ రద్దు సరే వితంతు పెన్షన్ ఏది?

పబ్బు సత్తెమ్మ అనే మహిళ భర్త మృతి చెంది ఏడాదిన్నర అవుతున్నది. ఆయన మృతి చెందిన తరువాత డెత్ సర్టిఫికెట్ పెట్టి తన భర్త పెన్షన్ రద్దు చేసి తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు స్వీకరించిన అధికారులు ఆమె భర్త పెన్షన్‌ను రద్దు చేశారు కానీ, వితంతు పెన్షన్ మంజూరు చేయలేదు. దాని కోసం ఈ నిరుపేద మహిళ ఎదురు చూస్తూనే ఉన్నది.

Read Also- Actress Pakeezah: తమిళనాడు ఆధార్ ఉంది.. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ఆదుకోండి!

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?