PM Modi: గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కేవలం ఓట్ల కోసమే అస్సాం భూములను విదేశీ చొరబాటుదారులకు ధారాదత్తం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండు రోజుల అస్సాం పర్యటనలో భాగంగా ఆదివారం కాజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన అనంతరం కలియాబోర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దశాబ్దాల తరబడి కొనసాగిన కాంగ్రెస్ పాలనలో అక్రమ వలసలు పెరిగిపోయాయని, వన్యప్రాణుల కారిడార్లు, అడవులు, సంప్రదాయ సంస్థల భూములను కూడా చొరబాటుదారులు ఆక్రమించేలా ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు. దేశ భద్రత కంటే తమ ఓటు బ్యాంకు రాజకీయాలకే ఆ పార్టీ ప్రాధాన్యతనిచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆక్రమణకు గురైన లక్షలాది ఎకరాల భూమిని విడిపిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. అస్సాం అస్తిత్వాన్ని, సంస్కృతిని కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
మొదటి ఛాయిస్ బీజేపీనే..
ఒకప్పుడు రాష్ట్రాన్ని ప్రధాన స్రవంతికి దూరంగా ఉంచి హింసలోకి నెట్టారని, కానీ ఇప్పుడు శాంతి, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పారు. 2020 బోడో ఒప్పందం ద్వారా వేలాది మంది యువత ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో చేరారని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నెగటివ్ పాలిటిక్స్ చేస్తోందని, అందుకే ప్రజలు ఆ పార్టీపై నమ్మకం కోల్పోయారని మోదీ అన్నారు. అభివృద్ధిని కాంక్షించే ఓటర్లకు ఇప్పుడు బీజేపీనే మొదటి ఎంపికని పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ముంబై పౌర ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలే దీనికి నిదర్శనమని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్లే అస్సాం వేగంగా వృద్ధి చెందుతోందని, గత 11 ఏళ్లలో బ్రహ్మపుత్ర నదిపై అనేక వంతెనలు నిర్మించామని తెలిపారు. కాజిరంగా లాంటి వారసత్వ సంపదను కాపాడుకుంటూనే మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
Also Read: Assembly Session: ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు.. ఈసారి జగన్ రావాల్సిందేనా? లేదంటే సీటు గల్లంతేనా?
జంగిల్ రాజ్‌కు కాలం చెల్లింది
మరోవైపు, బెంగాల్‌లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గత 15 ఏళ్లుగా సాగుతున్న టీఎంసీ ‘మహా జంగిల్ రాజ్’కు ప్రజలు వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారు. ఆదివారం హుగ్లీ జిల్లాలోని సింగూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ. 830 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, కోల్‌కతాను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆయన ప్రారంభించారు. సభలో మోదీ మాట్లాడుతూ, బెంగాల్ అస్థిత్వంతోనూ, దేశ భద్రతతోనూ టీఎంసీ ఆటలాడుతోందని మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ, వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరసనలు చేస్తోందని ఆరోపించారు.
సిండికేట్ ట్యాక్స్‌కు చెక్..
సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేయడానికి కేంద్రం ఎన్ని లేఖలు రాసినా, భూమి కేటాయించకుండా టీఎంసీ అడ్డుపడుతోందని విమర్శించారు. గ్యాంగులకు, మాఫియాకు కొమ్ముకాస్తూ నకిలీ పత్రాలు సృష్టిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. బెంగాల్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను ప్రజలకు చేరకుండా అడ్డుకుంటోందని ప్రధాని ధ్వజమెత్తారు. ‘ఇక్కడ దేనికైనా సిండికేట్ ట్యాక్స్ చెల్లించాల్సిందే. రౌడీలు, లూటీ దారులు, మాఫియాలకు ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. ఈ దోపిడీని కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే అరికట్టగలదు. ఇది మోదీ గ్యారెంటీ’ అని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు వందేమాతరం గీతం స్వేచ్ఛకు నినాదంగా మారిందని, ఇప్పుడు బెంగాల్ అభివృద్ధికి అదే మంత్రం కావాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు తథ్యమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: BRS Party: మున్సిపల్, ఎన్నికల్లో నమ్మకస్తులకే బాధ్యతలు.. ఆ మాజీ ఎమ్మెల్యేలకు చెక్!

