BRS Party: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నేతలను సన్నద్ధం చేస్తున్నది. రిజర్వేషన్లు సైతం ప్రభుత్వం ప్రకటించడంతో గులాబీ పార్టీ మరింత స్పీడ్ పెంచింది. రాష్ట్రంలోనే 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఎన్నికల సమన్వయ కర్తలను నియమించే పనుల్లో నిమగ్నమైంది. తమకు దగ్గరగా ఉన్న అనుయాయులు, నమ్మకస్తులను సమన్వయ కర్తలను నియమించబోతున్నట్లు సమాచారం. అప్పుడైతేనే మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. త్వరలోనే ప్రకటించబోతున్నట్లు సమాచారం.
ఉమ్మడి మెదక్‌కు హరీశ్ రావు బాధ్యత
ఉమ్మడి మెదక్ జిల్లాలో సమన్వయకర్తలను మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. 17 మున్సిపాలిటీలు ఉండగా అన్నింటికీ స్థానికంగా ఉన్న నమ్మకస్తులను నియమించారు. ఇద్దరు ఎమ్మెల్సీలుగా పని చేసిన వారు తప్ప మిగతా వారంతా మున్సిపాలిటీలో పట్టున్న వారికి బాధ్యతలు అప్పగించారు. వారు ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పట్టు నిలుపుకునేందుకు హరీశ్ రావు సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.
Also Read: BRS Party: మరో కొత్త కార్యక్రమానికి తెరలేపిన గులాబీ పార్టీ.. త్వరలో ప్రారంభం..?
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు చెక్!
మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక నేతలకే గెలుపు బాధ్యతలను అప్పగించబోతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించకుండా దూరం పెడుతున్నట్లు తెలిసింది. వీరిపై మున్సిపాలిటీలో కొంత వ్యతిరేకత ఉండడంతో మళ్ళీ వారికి బాధ్యతలు అప్పగిస్తే నష్టం జరుగుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకే సమన్వయకర్తలుగా నియమించే వారికి పూర్తి బాధ్యతలు అప్పగించబోతున్నట్లు సమాచారం. కొన్ని మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేకు కౌన్సిలర్లకు మధ్య సమన్వయ లోపం ఉన్నది. దీంతో నష్టం చేకూరుతుందని అందుకే అధిష్టానం తమకు దగ్గరగా ఉన్న నేతలను సమన్వయకర్తలుగా నియమించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
త్వరలోనే కేటీఆర్ మున్సిపాలిటీల బాట?
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రచారం చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని మున్సిపాలిటీలను కవర్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. కార్పొరేషన్లలో సైతం పాగా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని సైతం కైవసం చేసుకున్నది. తిరిగి మళ్లీ అన్ని మున్సిపాలిటీల్లో విజయ సాధించేందుకు కసరత్తు ప్రారంభించింది. గ్రూపులకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. వాటన్నింటికీ చెక్ పెట్టేందుకే సమన్వయ కర్తలను తెస్తున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీకి సైతం అవకాశం ఇవ్వకుండా మెజార్టీ స్థానాల్లో విజయం కోసం పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇది ఎంత మేరకు వర్కవుట్ అవుతుందో చూద్దాం.
Also Read: BRS Party: మరో కొత్త కార్యక్రమానికి తెరలేపిన గులాబీ పార్టీ.. త్వరలో ప్రారంభం..?

