Telangana Politics: తెలంగాణలో పొలిటికల్ పార్టీల ముఖ్య లీడర్లు ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లోని ముఖ్య లీడర్లు ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, రాజకీయ సిద్ధాంత పరంగా మాట్లాడడం కంటే వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఒక నేతపై మరోక నేత కౌంటర్లు అంటే పర్సనల్‌గా దూషించుకోవడమే అనేలా పాలిటిక్స్ మారిపోయాయి. ఇలాంటి పరిస్థితులు ఏపీలో అత్యధికంగా కనిపిస్తుంటాయి. కానీ, గత కొన్ని నెలలుగా తెలంగాణలో కూడా ఇలాంటి రాజకీయాలు కనిపిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య సిద్ధాంతాల పోరాటం పక్కకు జరిగి, వ్యక్తుల మధ్య యుద్ధంగా మారుతున్నది.
పరస్పర దూషణలు చేసుకుంటూ లీడర్లు
హద్దులు మీరుతూ విమర్శలు చేసుకొని కార్యకర్తల మధ్య పగ, కుట్రలకు తెరలేపుతున్నారు. రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలు సహజం. కానీ ప్రస్తుత నేతలు ఆ తరహాలో వ్యవహరిస్తున్న వారు కానరావడం లేదని సీనియర్ రాజకీయ నాయకులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులను, వ్యక్తిగత అలవాట్లను, చివరకు శారీరక ఆకృతిని కూడా ఎద్దేవా చేయడం ఇప్పటి పాలిటిక్స్‌కు ట్రెండ్‌గా మారిపోయింది. ప్రతిపక్షాలతో పాటు అధికార పార్టీలోనూ ఇలాంటి వైఖరి కనిపిస్తున్నది. హుందాగా రాజకీయాలు చేయకుండా పరస్పర దూషణలు చేసుకుంటూ లీడర్లు ముందుకు వెళ్తున్నారు. మూడు పార్టీల కిందిస్థాయి నాయకుల నుంచి కీలక లీడర్ల వరకు అందరిలోనూ ఇదే పరిపాటిగా మారింది. ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదని సీనియర్ నాయకులు సూచిస్తున్నారు.
Also Read: Telangana politics: కవిత ఆరోపణలపై విచారణ!.. టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
గతంలో ఢిఫరెంట్ పాలిటిక్స్
వాస్తవానికి ఉమ్మడి ఏపీలో రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తిగత దూషణలు చాలా అరుదుగా మాత్రమే కనిపించేవి. ముఖ్య లీడర్ల నుంచి క్షేత్రస్థాయి నేతల వరకు పార్టీల సిద్దాంతాల పరంగా, అభివృద్ధి విషయంలో విమర్శలు, ప్రభుత్వ తప్పిదాలు, నిర్లక్ష్యం వంటి వాటిలో ప్రశ్నించేవారు. అలా మాత్రమే రాజకీయాలు కొనసాగేవి. ముఖ్యమంత్రుల స్థానాల్లో ఉన్న లీడర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులంతా పార్లమెంటరీ భాషను మాత్రమే వినియోగిస్తూ, వ్యంగ్యంగా విమర్శలు చేసేవారు. ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం అనే స్టైల్‌లో మాత్రమే హుందాగా పరస్పర విమర్శలు జరిగేవి. కానీ ప్రస్తుతం బూతులు, తిట్లు, శాపనార్ధాలు వంటివి ట్రెండ్‌గా మారాయి. ఇవి లేకుంటే ఆశించిన స్థాయిలో ఎదుటి నేతకు కౌంటర్ సరిపోదనే భావనతో ఉన్నారు.ప్రజలు, కార్యకర్తలు కూడా లీడర్ల మధ్య తిట్ల పురణాలనే ఎంజాయ్ చేయడం గమనార్హం.
క్యాడర్‌లో నైతిక బలం నింపే ప్రయత్నం
ఈ తరహాలో మాట్లాడిన లీడర్‌నే టాప్ నేతగా ఊహించుకోవడం విచిత్రకరం. ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికార బలంతో ప్రత్యర్థుల గత చరిత్రను, కుటుంబాలను టార్గెట్ చేస్తూ, పాలన కంటే ప్రతీకారానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ సీనియర్ పొలిటికల్ లీడర్ల మధ్య జరుగుతున్నది. ఇక, బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నిరాశలో ఘాటైన పదజాలం, ఎదురుదాడి చేస్తూ, క్యాడర్‌లో నైతిక బలం నింపే ప్రయత్నంలో భాగంగా భాషపై నియంత్రణ కోల్పోయి దారుణంగా వ్యవహరిస్తున్నదని అనుుంటున్నారు. బీజేపీ కూడా భావోద్వేగ అంశాలతో పాటు, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విమర్శలు చేస్తున్నదని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ వివరిస్తున్నారు.
పీక్ స్టేజ్‌కు వ్యక్తిగత దూషణలు
ప్రస్తుత రాజకీయాల్లో ముఖ్య నేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరిదీ ఒకే ధోరణి. సోషల్ మీడియా విస్తృతం కావడంతో వ్యక్తిగత దూషణలు కొన్ని సార్లు కుటుంబాల నుంచి పడకగదుల వరకు వెళ్లడం ఆశ్చర్యకరం. నేతల మాటల్లో కంటెంట్ కంటే ‘కాంట్రవర్సీ’యే ఎక్కువగా ఉంటున్నది. ఒకరి అవినీతిని ప్రశ్నించాల్సింది పోయి, ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేయడం ఇప్పుడు రాజకీయ వ్యూహంలో భాగమైంది. సోషల్ మీడియాలోనూ ఇలాంటి కంటెంట్‌కే ట్రోల్స్, వ్యూస్, జనాలు పరిశీలించడం, పాపులర్ కావడం వంటివి జరుగుతున్నాయి. ఈ పరిస్థితులను చూసి రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ లీడర్లు విస్మయానికి గురి కావాల్సి వస్తున్నది. “మేము రాజకీయాలు చేసిన రోజుల్లో గొడవలు అసెంబ్లీ గేటు బయటే ఉండేవి. లోపలికి వెళ్తే గౌరవంగా పలకరించుకునే వాళ్లం. కానీ ఇప్పుడు పలకరిస్తేనే పాపం అనే పరిస్థితి వచ్చింది” అని ఒక సీనియర్ మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ, ప్రజాస్వామ్యంలో హుందాతనం అనేది ఆభరణం. నేతలు తమ ‘ఫ్రస్ట్రేషన్’ను ప్రజల కోసం పోరాటంలో చూపించాలి కానీ, బూతుల పురాణంలో కాదని ఆయన వివరించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే యువతకు రాజకీయాల పట్ల విరక్తి కలిగే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే ‘విమర్శలు సిద్ధాంతంపై ఉండాలని, వ్యక్తిత్వంపై చేయరాదని చెప్పారు.
Also Read:Telangana Politics: బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని బండి సుధాకర్ డిమాండ్

