Mahesh Kumar Goud: పదేళ్ల బీఆర్ ఎస్ పాలన, 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై చర్చించేందుకు తాను రెడీగా ఉన్నానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. మాజీ మంత్రి హరీష్ రావు తన సవాల్ ను స్వీకరించాలన్నారు. ఎక్కడికి రావాలని పిలిచినా, వస్తానని పీసీసీ చీఫ్ వెల్లడించారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ…బీఆర్ఏస్ పదేళ్ల పాలనలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కంచె చేను మేసినట్లు ప్రభుత్వ ఆస్తులు నాశనం చేశారన్నారు.
రూ.1.20 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి కూడా నీరు రాలేదన్నారు. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిందన్నారు. బీఆర్ ఎస్ నాలుగు ముక్కలాటలో హరీష్ రావును పక్కకు పంపిస్తారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇస్తారనే నమ్మకం కూడా లేదన్నారు. బీఆర్ ఎస్, బీజేపీ పొత్తు అంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ నాయకులు సమాధానం ఇవ్వాలన్నారు.
Also Read: Opal Suchata Chuangsri: మిస్ వరల్డ్ కు గవర్నర్ సన్మానం.. హాజరైన సీఎం మంత్రులు!
మహిళా నేతలతో రివ్యూ…
తెలంగాణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు అధ్యక్షతన గాంధీభవన్ లో సోమవారం రివ్యూ జరిగింది. మహిళా నేతలతో పార్టీ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా టీ పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సీనియర్ మహిళా కార్యకర్తలకి తప్పకుండా పీసీసీలో చోటు కల్పిస్తామన్నారు. కార్యకర్తల పదవులపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తగిన అవకాశాలు కల్పిస్తామన్నారు. కష్టపడే వాళ్లకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. క్రమ శిక్షణ చర్యలు తప్పితే ఎంతటి వారికైనా సరే వేటు వేయాక తప్పదన్నారు. రాజకీయాల్లో ఓపిక కచ్చితంగా ఉండాలన్నారు. పీఏసీ కమిటీలో అన్ని కులాల వారికి సముచిత స్థానం లభించిందన్నారు. ఇక హరీష్ రావు, ఈటల రాజేందర్ భేటీప తనకు స్పష్టమైన సమాచారం ఉన్నదన్నారు.
ఇక ఆరు దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ తెర దించిందన్నారు. ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు నిర్వీర్యం చేశారన్నారు. అందుకే పునర్నిర్మాణ దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందన్నారు. బీఆర్ ఎస్ పదేళ్ల ఆర్ధిక విధ్వంసాన్ని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం బాటలో తెలంగాణ ముందుకు సాగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ల తరహాలో ముందుకు సాగిస్తున్నామన్నారు. సామాజిక న్యాయం కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు.
శాస్త్రీయంగా కుల గణన ను పూర్తి చేశామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అందిస్తామన్నారు. ఒక్క ఏడాదిలోనే 65 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాజీవ్ యువ వికాస్ ద్వారా 5 లక్షల యువతకు ఆర్ధిక సాయం చేయబోతున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం రూ. 21 వేల కోట్లు రుణమాఫీతో 25 లక్షల రైతులకు ఉపశమనం కలుగుతుందన్నారు. 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య దిగుబడితో దేశంలో ప్రథమ స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు.
Also Read: Kishan Reddy: అభివృద్ధి కాదు, అవినీతి పెరిగింది.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్!