Kishan Reddy: తెలంగాణ ఆవిర్భావం జరిగి 11 ఏండ్లవుతున్నా తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదని, తెలంగాణలో పెరిగింది అభివృద్ధి కాదని.., అవినీతి మాత్రమే పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. నీళ్ల పేరుతో నిధులు దోపిడీ చేశారని, నియామకాల పేరుతో కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మండిపడ్డారు. అన్ని రకాలుగా తెలంగాణను అప్పలపాలు చేశారని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు.
అమరవీరులు, ఉద్యమకారుల ఆకాంక్షలను తాకట్టు పెట్టారని ఫైరయ్యారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. ఇకపోతే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలన్నీ పేపర్లకే పరిమితమవుతున్నాయని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. కేసీఆర్.. బంగారు తెలంగాణ, దళిత ముఖ్యమంత్రి అని అనేక హామీలిచ్చి ప్రజలను నిలువునా దోపిడీ చేశారని, కానీ కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిందని, ప్రజల స్థితి ఇంకా మారలేదన్నారు.
Also Read: Mid Day Meals: ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. జూన్ 12 నుంచి అమలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం అవుతున్నా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేయడం లేదని మండిపడ్డారు. అవినీతి, కుటుంబ పార్టీల నుంచి తెలంగాణను రక్షించాలన్నా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా బీజేపీ సర్కార్ రావాలని ఆయన కోరారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేసీఆర్.. సోనియాను దేవత అన్నారని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అదే సోనియాను దెయ్యం అన్నారని పేర్కొన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ శనిలా పట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని చురకలంటించారు.
బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఆర్థిక క్రమశిక్షణ లేదని విమర్శలు చేశారు. ఆర్థిక క్రమశిక్షణ లోపం వల్ల ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని, అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా కుంటుపడిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేమని ప్రజలకు కాంగ్రెస్ నేతలు బహిరంగoగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటక, తమిళనాడు బీజేపీ సహ ఇన్ చార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అనేక హామీలిచ్చి అమలు చేయకుండా విస్మరించడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ మోసపూరితమైన హామీలతో కాలం గడుపుతోందని, కాంగ్రెస్.. చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావు రీ ఎంట్రీ!