Nagarkurnool Lok Sabha Elections
Politics

Lok sabha Elections: నాగర్ కర్నూల్‌లో నెగ్గేది ఎవరో..?

– సత్తా చాటేందుకు కాంగ్రెస్ వ్యూహం
– లక్షన్నర మెజారిటీకై హస్తం యాక్షన్ ప్లాన్
– ఒక్క ఛాన్స్ అంటూ జనంలోకి బీజేపీ
– పొత్తులో బీఎస్పీకి సీటు వదిలేసిన బీఆర్ఎస్
– 3.75 లక్షల మాదిగల ఓట్లే కీలకం

Nagarkurnool Lok Sabha Elections: తెలంగాణలో జరగనున్న లోక్‌సభ స్థానాల్లో నాగర్ కర్నూల్ ఒకటి. ప్రతి ఎన్నికలోనూ ఇక్కడి ఓటర్లు విలక్షణ తీర్పునిస్తారనే పేరుంది. ఈ ఎస్సీ రిజర్వ్‌డ్ లోక్‌సభ స్థానంలో గద్వాల, అలంపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆలంపూర్, అచ్చంపేట ఎస్సీ రిజర్వ్‌డ్ కాగా.. మిగిలిన నియోజకవర్గాలు జనరల్‌. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 7 స్థానాల్లో గద్వాల, ఆలంపూర్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నాగర్‌కర్నూల్ స్థానంలో 17.32 లక్షల ఓటర్లున్నారు. వీరిలో సుమారు 20% ఎస్సీ ఓటర్లుండగా, ఎస్టీ ఓటర్ల సంఖ్య దాదాపు 1.6 లక్షలు. ఇక్కడ 3.75 లక్షల వరకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లున్నాయి. మొత్తం ఓటర్లలో 88 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే.

ఈసారి నాగర్ కర్నూల్ స్థానంలో త్రిముఖ పోరు జరుగుతుండగా, ఈ పోరులో కాంగ్రెస్, బీజేపీలు ముందున్నాయి. కాంగ్రెస్ నుంచి పార్టీ సీనియర్ నేత డా. మల్లు రవి, బీజేపీ నుంచి మాజీమంత్రి, సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్​ప్రసాద్, బరిలో ఉన్నారు. బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య కుదిరిన ఎన్నికల పొత్తులో భాగంగా ఈసారి ఈ సీటు బీఎస్పీకి దక్కగా, ఇక్కడి నుంచి ఆర్‌.ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. 1998లో ఇక్కడ కాంగ్రెస్ తరపున డా. మల్లు రవి గెలిచారు. 1999, 2004లో టీడీపీ తరపున మందా జగన్నాథం, 2009లో ఆయనే కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఈ సీటు నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి నంది ఎల్లయ్య ఎంపీ అయ్యారు. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు విక్టరీ కొట్టారు.

Also Read:చే’జారిన బామ్మర్ది

అనాదిగా ఈ నియోజక వర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా దీనిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు పరిధిలో లక్షకు పైగా మెజారిటీ సాధించటం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, 6 పథకాల ప్రభావం, కొత్తగా వస్తు్న్న ఉద్యోగాల నోటిఫికేషన్ల వల్ల తమ గెలుపు నల్లేరుపై నడకే అని ఆపార్టీ లీడర్లు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం వంగూరు మండలం కొండారెడ్డి పల్లి కావడం, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గ్రామస్థాయిలో మంచి పట్టు ఉండటం తమకు మంచి మెజారిటీని తెచ్చి పెట్టనున్నాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

మరోవైపు ఈ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతి సుమారు 1.30 లక్షల ఓట్లు సాధించారు. కానీ, ఆమెను పక్కనబెట్టిన పార్టీ అధిష్ఠానం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడైన భరత్ ప్రసాద్‌ను బరిలో దించింది. ఒక్కసారి అవకాశం ఇవ్వండంటూ ఆ పార్టీ ఓటర్ల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ నాగర్ కర్నూలులో ఏర్పాటైన బహిరంగ సభలో పాల్గొని కొంత జోష్ తెచ్చే యత్నం చేశారు. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరున్న సీనియర్ నేత రాములుకున్న పరిచయాలు, అయోధ్య అంశం, మోదీ చరిష్మా తనకు కలసి వస్తాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది. తాము అధికారంలోకి వస్తే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు అండగా నిలుస్తామని, శ్రీశైలానికి నల్లమల అభయారణ్యం నుంచి ఎలివేటెడ్​కారిడార్, గద్వాల – రాయచూర్​ వయా మాచర్ల రైల్వే లైన్ నిర్మాణం, హార్టికల్చర్ వర్సిటీ వంటివి అమలు చేస్తామని ఆ పార్టీ ప్రజలకు హామీ ఇస్తోంది.

Also Read:సర్వం ‘సర్వే’స్వరం

బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తులో భాగంగా ఈ సీటులో ఈసారి బీఎస్పీ అభ్యర్థి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బరిలో నిలిచారు. అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రవీణ్​కుమార్‌, కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన ఈ నేతను ఓటర్లు ఏమేరకు రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. తనకు బీఎస్పీ, బీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు దక్కుతాయని ఆయన నమ్ముతున్నారు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు