– ఎన్నికల ముందు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సర్వే సంస్థలు
– ఒక దానికి మరొకటి సంబంధం లేని రిపోర్టులు
– గందరగోళానికి గురవుతున్న నాయకులు, ఓటర్లు
– తప్పుడు సర్వేలతో రాజకీయ పార్టీలను తప్పుతోవ పట్టిస్తున్న ఫేక్ సంస్థలు
– కొంచెం అటూఇటుగా సమగ్ర రిపోర్టులు ఇచ్చే సంస్థలు రెండో మూడో
– తప్పుడు సర్వేలను నమ్మి నట్టేట మునిగిన బీఆర్ఎస్
– లోక్ సభ ఎన్నికల సందర్భంగా మరోసారి తెరపైకి ఫేక్ సర్వేలు
Fake Political Surveys :గబ్బర్ సింగ్ సినిమాలో ఓ పాటకు ముందు ఎవడి డప్పు వాడు కొట్టండి అని హీరో అన్నట్టు నేడు వస్తున్న కొన్ని సర్వే సంస్థల తీరు అలాగే ఉంది. ఎగ్జిట్ పోల్ సర్వేలంటూ ఈ మధ్య పుట్టగొడుగుల్లా కొన్ని సంస్థలు పుట్టుకొస్తున్నాయి. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు చెప్పడంలో ఘనాపాటీలు ఈ ఫేక్ సర్వే రాయుళ్లు. సాధారణంగా ఎన్నికల సమయంలో ఏ పార్టీ గెలవబోతోందనే ఉత్సాహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని కొన్ని సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఓ సర్వే సంస్థ ఫలానా పార్టీకి ఇంత మెజారిటీ వస్తుంది అని చెబుతుంది. మరో సర్వే సంస్థ వేరే పార్టీకి ఈసారి అధికారం తథ్యం అంటుంది. ఇప్పుడు ఇదే ట్రెండ్ దేశమంతటా నడుస్తోంది. సరిగ్గా జనం నాడి పట్టుకుని చేసే సర్వే సంస్థలు వేళ్ల మీద లెక్కపెట్టేవిగా ఉంటే, ఫేక్ సర్వే రిపోర్టులు ఇచ్చే సంస్థలు కోకొల్లలుగా ఉంటున్నాయి. ఏ సర్వే ఎలాంటిది ఎవరికి ఫేవర్ అన్నది కూడా కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి ఇట్టే అర్ధం అయిపోతుంది.
ఎవరికి తోచిన సర్వే వారిదే!
గత రెండు ఎన్నికల నుంచి మార్కెట్‌లో సదరు సర్వేశ్వరులు దిగిపోయారు. రాజకీయ వ్యాపారానికి మించి సరిసాటి ఏదీ లేదని భావించి ఎక్కడ ఎన్నికలు జరిగినా వచ్చి వాలిపోతున్నారు. వారు చేస్తున్న విధానం ఏమిటి? తీసుకుంటున్న శాంపిల్స్ ఏమిటి? అన్నది కూడా తెలియడం లేదు. కేవలం కాకి లెక్కలు చెబుతూ చిలక జోస్యం చెబుతూ ఏ రాజకీయ పార్టీ గూటికాడ ఆ పాట పాడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఫలితంగా సర్వేలను నమ్ముతున్న రాజకీయ పార్టీలు బొక్క బోర్లా పడుతున్నాయి. కొన్ని పార్టీలు అయితే విపరీతంగా నమ్మేసి అధికారం నుంచి కూడా దిగిపోయి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యం ఉంది. నిజానికి సర్వే వ్యవస్థ అన్నది చాలా ఉపయుక్తమైనది. తప్పులు ఏదైనా జరిగితే సరిదిద్దుకునేందుకు వాడుకోవచ్చు. ప్రజల మూడ్ ఇలా ఉంది అంటే వాటిని సెట్ రైట్ చేసుకుంటూ వెళ్ళేందుకు ఇవి ఉపయోగపడతాయి. కానీ, సర్వేలనే తప్పు దోవ పట్టిస్తూ తమకు అనుకూలంగా చేయించుకుంటూ తమను తాము మభ్యపెట్టుకుంటూ జనాలనూ మభ్యపెడుతూ వదులుతున్న కొన్ని సర్వేల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని అంటున్నారు.
జాతీయ సంస్థల్లోనూ ఫేక్ సర్వేలు
ఎవరితో బిజినెస్ రిలేషన్ ఉంటే వారికి అనుకూలంగా సర్వేలు చేసి ఇవ్వడం ఓ అలవాటుగా మారింది. దానివల్ల క్రెడిబిలిటీ ఆయా సంస్థలకే పోతోంది. మరి వాటికి కూడా సిద్ధపడి సర్వేలు చేస్తున్నారు అంటే దాని వెనుక ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా అర్థం చేసుకోవాలని అంటున్నారు. సర్వేలు అంటే వెంటనే వచ్చే మాట ఫేక్ అని. జనాల మూడ్ ఏమిటో తెలియదు కానీ, భారీ నెంబర్లు వేసి ఫలానా పార్టీ గెలుస్తుంది అని వన్ సైడెడ్‌గా చెప్పేస్తున్న సర్వే రాయుళ్ళను అంతా చూస్తున్నారు. జాతీయ సంస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. వారికి ఉన్న ప్రయోజనాలు ఏమిటో, ఎవరిని నెత్తిన పెట్టుకుని వస్తున్నారో, జనాల చేత ఎవరిని మోయించాలని చూస్తున్నారో, దాని వెనక వారికి ఉన్న ఇంట్రెస్ట్ ఏమిటి అన్నది అందరికీ తెలుసు. ఇలాంటి ఫేక్ సర్వేలను చూసిన జనాలు మాత్రం అసలు నమ్మడం మానేస్తున్నారు. కేవలం పలుకుబడి డబ్బులకు లొంగిపోయిన ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్థలు కూడా సర్వేలు ఇస్తున్నాయంటే దిగజారుడు పోకడలకు ఇది నిదర్శనం అని అంటున్నారు.
ఎక్కువ శాతం ఫెయిల్ అవుతున్న సర్వేలు
నాలుగు నెలల క్రితం తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన అనేక సర్వేలు తప్పని నిరూపించబడ్డాయి. ఇప్పుడు ఏపీలో వస్తున్న సర్వేల తీరుని కూడా జనాలు తమ తీర్పు ద్వారా ఎక్కడో పెడతారు అనే అంటున్నారు. మొత్తానికి సర్వేలకు కాలం చెల్లింది అనే అనుకుంటున్నారు మెజారిటీ జనాలు. దిగజారుడు తీరుతో ఇస్తున్న సర్వేలు వస్తున్న పోకడలు చూసిన విద్యావంతులు కానీ, టీవీలు చూస్తున్న వారు కానీ సోషల్ మీడియాలో చురుకుగా ఉండేవారు కానీ, అసలు నమ్మడం లేదు సరికదా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. గ్రౌండ్ రియాల్టీస్ అన్నవి అక్కడ ఉన్న ఓటర్లకు తెలుస్తాయి. అలాగే, అభ్యర్ధులకు ఎంతో కొంత నాడి అర్థం అవుతుంది. ఇక రాజకీయ పార్టీల అధినేతలు జనాల్లోకి వెళ్తున్నపుడు జనంలో వచ్చే స్పందన వల్ల కొంత అర్ధం చేసుకోగలుగుతారు. కానీ వాటిని పక్కన పెట్టి ఎక్కడో కూర్చుని అంకెల గారడీతో ఇచ్చే సర్వేలను నమ్ముకుంటే మాత్రం నిండా మునగడం ఖాయమని అంటున్నారు.