Fertilizer shortage: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎరువుల కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని అందుకు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి బాధ్యత వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. కోహెడ మండలం తంగళ్ళపల్లి క్రాస్ రోడ్ నుండి కోరెల్లి గ్రామం వరకు రూ.1.55 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన, అదేవిధంగా హుస్నాబాద్ మండలం తోటపల్లి, క్రాస్ రోడ్ వద్ద నుండి మూసావేర్లపల్లి వరకు రూ.2.57 కోట్ల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కోహెడ మండలంలోని బస్సాపూర్ హుస్నాబాద్ మండలం పోతారం అక్కన్నపేట, మండలం కేజీబీవీ పాఠశాలలలో వన మహోత్సవంలో భాగంగా మంత్రి చెట్లను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎరువుల కొరతకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సాయం చేయడం లేదని విమర్శించారు.
బీజేపీ అధ్యక్షుడికి తెలియదా?
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి వ్యవసాయానికి ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో తెలియనట్టు ఉంది అంటూ పొన్నం సెటైర్లు వేశారు. మిగతా అన్ని రకాల విత్తనాలు, నీళ్ళు, విద్యుత్ అన్ని రకాల వస్తువులు రాష్ట్రాలు ఇస్తాయని, ఎరువుల తయారీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందని చెప్పారు. రాష్ట్రానికి సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమంటే చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత వివక్ష పూరితంగా వ్యవహరిస్తుందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. రైతులకు ఎరువులను దాచిపెట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పిచ్చి పని చేస్తుందా అంటూ మండిపడ్డారు. బీజేపీ నాయకులు, అధ్యక్షుడు రాంచందర్ రావు మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also- Gurramgadda Village: తెలంగాణలోని ఏకైక ద్వీప గ్రామం.. సమస్యల వలయం
కావాలంటే ఢిల్లీ వెళ్లండి..
ఢిల్లీ వెళ్లి మీ ప్రధాన మంత్రి దగ్గర కూర్చొని తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించండి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యత తీసుకోండి అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘రైతుల దగ్గర రాజకీయాలు అవసరం లేదు. యావత్ రైతాంగం ఎరువులు కావాలని డిమాండ్ చేస్తున్నది. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీలో సంబంధిత కేంద్రమంత్రిని కలిశారు. ఎరువులు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నాయకత్వానికి కనీసం దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఎరువులు దాచిపెడుతుందని మాట్లాడుతున్నారు. ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత, సరఫరా ఎంత, రావాల్సింది ఎంతనో తెలుసుకొని రాంచందర్ రావు ఢిల్లీ వెళ్లే ప్రయత్నం చేయాలలి’’ అని సూచించారు.
కాంగ్రెస్‌పై కుట్రలు
ఎవరువు కేంద్రం పరిధిలో ఉంటాయని ప్రజలు అర్ధం చేసుకోవాలని పొన్నం కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర జరుగుతుందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారని, ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఎరువులు సరైన విధంగా సప్లై చేయకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవాల్లో భాగంగా 40 లక్షలకు పైగా తాటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నదని, తెలంగాణ కల్లుగీత గౌడ సంఘాలు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తునట్లు తెలిపారు.
Read Also- MBBS Fees: రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్థాన్.. ఏ దేశంలో ఎంబీబీఎస్ ఫీజు తక్కువ?