Gurramgadda Village: కృష్ణానది మధ్యలో ఉన్న దీవి గ్రామం గుర్రంగడ్డ. ఆ గ్రామస్తుల కష్టాలు నేటికీ తీరడం లేదు. చుట్టూ నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు లేక గ్రామం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నది. గ్రామం నుంచి వివిధ పనుల నిమిత్తం వెళ్లేందుకు నదిపై పవర్ బోట్‌లో ప్రమాదకరస్థాయి నీటి ప్రవాహంలో వెళ్లాల్సిందే. గతంలో విద్యుత్ సౌకర్యం సైతం లేకపోవడంతో అనేక ఏళ్లుగా ప్రభుత్వాలతో పోరాడి దాన్ని సాధించుకున్నా, రవాణా కష్టాలు మాత్రం తీరడం లేదు. మాజీ సీఎం కేసీఆర్ రూ.12 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు ఇచ్చినా నేటికీ పూర్తి కాకపోవడంతో గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బోటులో ప్రయాణిస్తున్నారు. రాష్ట్రంలోనే ఏకైక ద్వీపంగా పేరుగాంచిన గుర్రంగడ్డ కష్టాల కడలిలో వందలాది కుటుంబాలు బాహ్య ప్రపంచానికి దూరంగా జీవనం సాగిస్తున్నాయి.
ఆరు నెలలు నదీ జీవనం
జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని కృష్ణా నది మధ్యలో గుర్రంగడ్డ ద్వీపంలా ఉంటుంది. వర్షాకాలంలో జూరాలకు నది ప్రవాహం పెరిగితే క్రస్ట్ గేట్లను ఎత్తుతారు. దీంతో కృష్ణమ్మ పరుగులు పెడుతూ గ్రామం గుండా రెండు పాయలుగా చీలుతూ బీచుపల్లి మీదుగా శ్రీశైలం వెళ్తుంది. దీంతో నది ప్రయాణం చేయలేక వృద్ధులు, వికలాంగులు గ్రామంలోనే జీవిస్తారు. ఈ ఊరు నేషనల్ హైవే 17 కు 5 కిలోమీటర్ల దూరంలో ఉండగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దీవి వైశాల్యం 2400 ఎకరాలు ఉండగా ఇక్కడ 200 కుటుంబాలు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నాయి. 1500 ఎకరాలలో ప్రధాన పంటగా వరి, వేరుశనగతో పాటు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. గ్రామ జనాభా 1300 ఉంది.
గ్రామంలో తిష్ట వేసిన సమస్యలు
విద్య, వైద్య పరంగా అనాదిగా గ్రామస్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 1984లో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయగా నేటికీ అప్ గ్రేడ్‌కు నోచుకోలేదు. పాఠశాలకు ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు వచ్చే అధికారుల రాకపోకలకు నదీ జలాలతో ఇబ్బందులు పడుతున్నారు. మా గ్రామ తలరాత మారదని భావించి విధి లేక తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లతోపాటు సమీపంలోని పెబ్బేరులో ఇల్లు అద్దెకు తీసుకొని చదివిస్తున్నారు. మరికొందరు తమ బంధువుల ఇళ్ల దగ్గర విద్యాభ్యాసం కోసం వదులుతున్నారు. గ్రామంలోకి మిషన్ భగీరథ నీరు రాక కొందరు ఫిల్టర్ వాటర్ వాడుతున్నా మరికొందరు కృష్ణా నది జలాలనే తాగునీటికి వినియోగిస్తున్నారు. నిత్యం వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారితో పాటు గ్రామంలో ఏ ఒక్కరికి అనారోగ్య సమస్య వచ్చినా బోటులో ప్రయాణం చేయాల్సిందేనని, ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకున్నా వరద ఉధృతిలో సుడిగుండాలను తప్పించుకొని ప్రయాణిస్తున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. గత నాలుగేళ్ల క్రితం నూతన పవర్ బోటును ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సంతోష్ పవర్ బోట్‌లో గ్రామాన్ని చేరుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Read Also- Aaraa Mastan: గుంటూరు మస్తాన్ హైదరాబాద్‌లో కబ్జా! అన్ని పార్టీల అండదండలు
వేసవిలోనే వ్యవసాయానికి సరిపడా ఫర్టిలైజర్ నిల్వలు
జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు నదీ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. గ్రామానికి పెబ్బేరు వైపు ఉన్న నదిలో నీరు తగ్గాక రైతులు స్వచ్ఛందంగా చందాలు వేసుకుని ఏర్పాటు చేసుకుంటారు. ఈ సమయంలోనే రైతులు పంటల సాగులో అవసరమైన ఫర్టిలైజర్, ఇతర బరువు గల వస్తువులను వేసవిలోనే బీచుపల్లి జాతీయ రహదారి గుండా రాకపోకలు కొనసాగిస్తూ ఆరు నెలలకు సరిపడా వస్తువులను గ్రామంలో నిలువ చేసుకుంటారు.
ఏడేళ్లుగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో..
దశాబ్ద కాలంగా గ్రామానికి రాకపోకల కోసం ఏర్పాటు చేయాల్సిన బ్రిడ్జి నిర్మాణం కాంట్రాక్టర్ అలసత్వం, నీటి ప్రవాహం వల్ల సకాలంలో పూర్తి కావడం లేదు. గుర్రంగడ్డ గ్రామానికి వరద ప్రవాహం తక్కువగా ఉండే పెబ్బేరు వైపు 4.5 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జి 34 పిల్లర్లకు గాను గత ఆరేండ్లుగా 26 మాత్రమే పూర్తయ్యాయి. రానున్న వేసవిలో పిల్లర్ల పైన అనుసంధానం చేసే దిమ్మలు, గడ్డర్లను ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు.
Read Also- Bandi Sanjay: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమా.. బండి హాట్ కామెంట్స్