Jupally Krishnarao: మాజీ మంత్రి హరీశ్ రావు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గురుకుల విద్యార్థులకు జరిగిన దారుణ పరిస్థితిలను గుర్తుకు తెచ్చుకొని మాట్లాడాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆస్వస్థతకు గురైన బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులను ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో దాదాపు 150 మందికిపైగా గురుకుల విద్యార్థులు చనిపోయారని, వేలాదిమంది అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. ఏనాడైనా కేసీఆర్ ఒక్క విద్యార్థినైనా పరామర్శించారా అని నిలదీశారు.
కేసీఆర్ ఏం చేశారు?
సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల ఎంతో ప్రేమ ఉందన్నారు మంత్రి. అందుకే విద్యా శాఖ తన దగ్గర ఉంచుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌తో పాటుగా ఇతర సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా పాఠశాలలను ఏర్పాటు చేయడం వల్లే ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. గతంలో తాను కేసీఆర్‌కు విద్యాసంస్థలపై సూచనలు చేస్తే నిర్లక్ష్యంగా మాట్లాడిన విషయం హరీశ్ రావుకు గుర్తులేదా అని అడిగారు. ఆనాడు మాట్లాడని ఆయన ఈరోజు ఏ విధంగా తప్పుపడుతున్నారని నిలదీశారు.
అన్నీ అవాస్తవాలే..
ప్రపంచ సుందరి పోటీల్లో భోజనానికి లక్ష రూపాయలు ఖర్చు అయ్యిందని అవాస్తవాలు మాట్లాడుతున్నారని జూపల్లి విమర్శించారు.
కేవలం 8వేల రూపాయలకు పైగా మాత్రమే వెచ్చించడం జరిగిందని, వివరాలను మీడియాకు వెల్లడించారు. పాఠశాలలో పాలల్లో పెరుగు కలపడం వల్ల విద్యార్థులకు అనారోగ్యం కలిగిందన్నారు. గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గురుకులాల్లో పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలను పెంచి, ఎంత ఖర్చు చేస్తుందని, స్థానిక సిబ్బంది అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన భోజన వసతులు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు.
Read Also- Fertilizer shortage: తెలంగాణలో ఎరువల కొరత.. అసలు కారకులు ఎవరు?
అధికారులకు ఆదేశాలు
పరిశుభ్ర వాతావరణంలో వంటలు వండి విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన భోజన వసతిని కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాలకు 15 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు వెంట బీసీ గురుకులాల సెక్రెటరీ సైదులు, అదనపు కలెక్టర్లు అమరేందర్ ఇతర అధికారులు ఉన్నారు. అంతకుముందు, మంత్రి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థినులకు ఉత్తమ వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. తల్లిదండ్రులతో మాట్లాడిన మంత్రి, ప్రభుత్వం పిల్లల ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహిస్తుందని భరోసా ఇచ్చారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Also- Gurramgadda Village: తెలంగాణలోని ఏకైక ద్వీప గ్రామం.. సమస్యల వలయం