BJP Telangana: ఎన్నో ఏండ్లుగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు నగారా మోగింది. దీంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలను అమలుచేయడంపై దృష్టిసారిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగి.., భవిష్యత్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తోంది. అందుకు కాషాయ పార్టీ (BJP Telangana) సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బీజేపీకి (BJP Telangana) లీడర్లు కూడా కరువైనట్లుగా తెలుస్తోంది. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణలో ప్రభావితం చేసే అవకాశాలున్నాయని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
Also Read: OG collections: ‘ఓజీ’ నాలుగో రోజు గ్రాస్ ఎంతో తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఆ రికార్డులు బ్రేక్..
లోకల్ ఫైట్ బీజేపీకి సవాల్
త్వరలో జరగబోయే లోకల్ ఫైట్ బీజేపీకి (BJP Telangana) సవాల్ గా మారనుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే ఉత్తర తెలంగాణలోని పెద్దపల్లి మినహా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్ సభ స్థానాలు బీజేపీవే. అంతేకాకుండా ఎమ్మెల్యే స్థానాలు 7 కూడా ఇక్కడివే ఉండటం గమనార్హం. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ ప్రాంతంపైనే కాషాయ పార్టీ ఆశలు భారీగా పెట్టుకుంది. ఈ ప్రాంతంలో అత్యధిక స్థానాల్లో ప్రభావితం చేయలేకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలకు మచ్చగా మారే ప్రమాదమున్న నేపథ్యంలో వారంతా సవాలుగా తీసుకోనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అర్వింద్ తమ లోక్ సభ పరిధిలో సత్తా చాటుతామని స్పష్టంచేశారు.
ఆ జిల్లాల్లోనూ పార్టీకి లీడర్లు కరువైన పరిస్థితి
ఇక దక్షిణ తెలంగాణ పరిధిలోని మెజారిటీ జిల్లాల్లో పార్టీ చాలా వీక్ గా ఉంది. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో పార్టీ వెనుకబడింది. వీటితో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ పార్టీకి లీడర్లు కరువైన పరిస్థితి ఏర్పడిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలాఉండగా పార్టీ సభ్యత్వాల్లో భాగంగా దాదాపు 45 లక్షల టార్గెట్ ను చేరుకున్న కమలదళం లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ లెక్కకు తగిన ఫలితం పొందుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో చాలా చోట్ల లీడర్లను తయారుచేసుకోవడంలో పార్టీ ఫెయిల్ అయిందనే విమర్శలు ఉన్నాయి. స్థానికసంస్థల ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో ఊపేస్తామని ధీమాతో ఉన్న ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు తమ మాటను నిలబెట్టుకుంటారా? లేదా? అనేది చూడాలి. దక్షిణ తెలంగాణలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Arattai App: వాట్సప్‌కు వణుకుపుట్టిస్తున్న మేడిన్ ఇండియా యాప్ ‘అరట్టై’.. కారణాలు ఇవే!