KTR: రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. ‘ఎక్స్’ వేదికగా సోమవారం ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని సుప్రీంకోర్టు చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా, మళ్లీ హరీశ్ రావుకి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే కాంగ్రెస్ సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోందన్నారు. హరీశ్ రావు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడని అన్నారు.
Also Read: Minister Seethakka: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?
కక్ష సాధింపు చర్యలు
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడటంలో కానీ ఆయన చూపిస్తున్న చొరవను చూసి కాంగ్రెస్‌కు వణుకు పుడుతోందన్నారు. అందుకే రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేక, ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే హరీశ్ రావు(Harish Rao)ను టార్గెట్ చేస్తూ ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తమకు చట్టంపై, న్యాయస్థానాలపై పూర్తి గౌరవం ఉన్నదన్నారు. అందుకే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కానీ, విచారణల పేరుతో, నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తే అది మీ భ్రమ మాత్రమే అని అన్నారు. తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, వేధింపులకు గురిచేసినా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపేది లేదన్నారు. సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్నారు.
Also Read: Drinking Water: జలమండలి ప్రత్యేక వ్యూహం.. రేపటికోసం కాస్త ముందుగానే కళ్లు తెరిచిన వాటర్ బోర్డ్!

