Minister Seethakka:
ములుగు, స్వేచ్ఛ: ‘‘రేవంతన్నా.. ఒక్క రోజులోనే ఎన్నో దశాబ్దాల మా కలలని నిజం చేశావు!!. అడవి బిడ్డల కళ్లల్లో ఆనందం నింపడమే కాదు ఆత్మగౌరవాన్నీ పెంచావు. మేడారంలో నిర్వహించింది మంత్రివర్గం సమావేశం మాత్రమే కాదు. ఆదివాసీ, గిరిజనుల్లో ఎన్నటికీ ఆరని ఆత్మవిశ్వాసపు యజ్ఞం. మేడారం పునరుద్ధరణ కేవలం నిర్మాణం మాత్రమే కాదు. తరతరాలు స్ఫూర్తి పొందే నిత్య చైతన్యదీపం. ములుగు జిల్లాకు గోదావరి జలాల తరలింపు నిర్ణయంతో ఈ నేల దాహాన్ని తీర్చడమే కాదు, మట్టి మనుషుల భవిష్యత్తుకు కొత్త దారి వేశావు. ఈ నేల నీ మేలుని ఎన్నటికీ మరువది!!’’ అని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు.
వెయ్యేళ్లు నిలిచేలా మేడారం ఆలయం
సమ్మక్క సారలమ్మ చరిత్రను మరో వేయ్యేళ్లు ఉండేలా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తమవంతు సహకారం అందజేసిన సహచర మంత్రివర్గ సభ్యులు అందరికీ ఒక ఆదివాసి బిడ్డగా పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని సీతక్క అన్నారు. ‘‘100 కిలోమీటర్ల మేర గోదావరి నది మా ములుగు నియోజకవర్గంలో పారుతున్నా మాకు ఇప్పటివరకు చుక్క నీరు కూడా రాలేదు. అయితే, ములుగులో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ములుగుకు గోదావరి జలాలు తరలించేందుకు రూ.143 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేశారు. నా జీవితంలో రెండే రెండు కలలుండేవి. ఒకటి మేడారం ఆలయ అభివృద్ధి, రెండు ములుగు నియోజకవర్గానికి గోదావరి జలాలు. గతంలో గోదావరి జలాల కోసం ఎన్నో పాదయాత్రలు జరిగాయి. కానీ నేడు ఇలాంటి యాత్రలు చేపట్టకుండానే మా యాత్రను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి మా నియోజకవర్గానికి రూ.143 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవలను యావత్ ఆదివాసి సమాజం, ములుగు నియోజకవర్గం గుర్తుంచుకుంటుంది. తమ కుల ఇలవేల్పు కోసం గత పాలకులు ఓ గుడిని నిర్మించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డికి సమ్మక్క సారలమ్మతో కుల బంధం, కుటుంబ బంధం లేదు. సకల జనులకు ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మలతో ముఖ్యమంత్రికి భక్తి బాధ్యత ఉంది. సమ్మక్క సారలమ్మ గుడితో ముఖ్యమంత్రికి భావోద్వేగ బంధం ఉంది. అందుకే కేవలం 3 నెలల స్వల్ప వ్యవధిలో గుడి నిర్మాణాన్ని పూర్తి చేశారు’’ అని సీతక్క పేర్కొన్నారు.
Read Also- Medaram Jatara 2026: మేడారానికి మహర్దశ.. ఈసారి కొత్తగా, సరికొత్తగా.. మారిన రూపు రేఖలు!
మేడారం ఆలయం వెయ్యేళ్లు నిలిచేలా పునరుద్ధరణ చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీల గుండెల్లో ఎప్పుడు నిలిచిపోతారని సీతక్క అన్నారు. రాష్ట్రం వెలుపల మేడారం అడవిలో, ఆదివాసి ప్రాంతంలో కేబినెట్ భేటీ నిర్వహించుకోవడం ఒక చరిత్ర అని ఆమె అభివర్ణించారు. ఈ కేబినెట్ సమావేశానికి వచ్చి ములుగు అభివృద్ధి కోసం మంచి నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ సహచరులకు, ఉన్నతాధికారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ములుగు మీద ప్రేమతో ఇక్కడికి విచ్చేసిన ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు అందరికీ ములుగు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఆమె పేర్కొన్నారు.
Read Also- Nagarkurnool District: జిల్లాలో 2 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ

