Drinking Water: వచ్చే వేసవి కాలంలో తాగునీటి కష్టాలు రాకుండా జలమండలి సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ(GHMC)తో పాటు ఓఆర్ఆర్(ORR) పరిధిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించుకున్నది. గత వేసవి కాలం ఫిబ్రవరి మాసంలో రికార్డ్ స్థాయిలో ట్యాంకర్లు బుక్ కావడంతో అందుకు కారణాలను అన్వేషించి తగిన చర్యలను చేపట్టిన జలమండలి.. ఈ సారి కాస్త ముందుగానే వేసవి కష్టాలను బేరీజు వేసుకుని తగిన ప్రణాళికలను సిద్దం చేసుకున్నట్లు తెలిసింది. వేసవిలో నీటి కష్టాలు రాకుండా గత నెల నుంచే జలమండలి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సరఫరా చేస్తున్న నీటి వృథాను అరికట్టడంతో పాటు సరఫరా చేస్తున్న ప్రతి నీటి చుక్క లెక్కలు తేల్చేందుకు సిద్దమైంది.
ప్రతి రోజూ సుమారు 3 వేల ట్యాంకర్లు
కుత్బుల్లాపూర్, కాప్రా, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో బుకింగ్ గతంతో పోల్చితే పెరిగినట్లు గుర్తించిన జలమండలి అధికారులు అందుకు కారణాలను అన్వేషించగా, భూగర్భ జలాల నీటి మట్టాలు తగ్గడమే కారణంగా నిర్థారించారు. ఇంకా ఎండాకాలం మొదలు కాక ముందే క్రమంగా నీటి సరఫరాకు డిమాండ్ పెరిగినట్లు గుర్తించిన జలమండలి ఫిబ్రవరి, మార్చి నెలల్లో డిమాండ్ సరఫరాను ముందుగానే అంచనా వేసి, అందుకు సంబంధించిన కార్యాచరణను అమలు చేసేందుకు సిద్దమయ్యారు. సంజీవరెడ్డినగర్, కూకట్‌పల్లి, దుర్గంచెరువు ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకర్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డిమాండ్‌కు తగిన విధంగా వాటర్ ట్యాంకర్లను వీలైనంత త్వరగా సరఫరా చేసేందుకు మరో రెండు ఫిల్లింగ్ స్టేషన్ పాయింట్స్ ఏర్పాటు చేయనున్నట్లు జలమండలి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం జలమండలి పరిధిలో ప్రతి రోజూ సుమారు 3 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. గత వేసవిలో సుమారు 12 వేల 500 ట్రిప్పుల వాటర్ ట్యాంకర్లు సరఫరా చేయగా, ఈ సారి అవసరమైతే ట్యాంకర్లను నైట్ షిఫ్టులో కూడా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: Municipal Elections 2026: మునిసిపల్ ‘రిజర్వేషన్ల’పై అసంతృప్తి.. టాక్ ఎలా ఉందంటే?
గతేడాదితో పోల్చితే..
గత వేసవి మాసంలో వినియోగదారులు ట్యాంకర్ బుక్ చేసుకున్న 24 గంటల్లో సరఫరా చేశామని, ఈ సారి బుక్ చేసుకున్న12 గంటల్లోనే ట్యాంకర్ నీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నీటి మట్టాలు ఆశాజనకంగానే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీనికి తోడు సింగూరు జలాశయానికి అవసరమైన మరమ్మతులను వేసవి ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని టార్గెట్ కూడా పెట్టుకుంది. ప్రస్తుతం నగరంలో ఇప్పటికే 1150 ట్యాంకర్లు, 90 ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు, 150 ఫిల్లింగ్ పాయింట్స్ ఉండగా, డిమాండ్‌ని బట్టి అదనపు ఫిల్లింగ్ స్టేషన్ కోసం ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో 8285 బోర్ వెల్‌లు ఉండగా, వాటిలో 4,569 నిరుపయోగంలో ఉన్నట్లు గుర్తించి, వాటిని హార్వెస్టింగ్ పిట్‌లతో ఇంజక్షన్ బోర్‌వెల్‌గా మార్చే చర్యలను కూడా చేపట్టారు. గతేడాదితో పోల్చితే ఈ సారి వాటర్ కనెక్షన్ల సంఖ్య పెరిగాయి. చెట్లకు, లాన్‌కి జలమండలి సరఫరా చేసే తాగే నీటిని వాడకుండా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా తాగునీటిని వృథా చేయకుండా, వాహనాలు కడిగేందుకు వినియోగిస్తున్న వారిని గుర్తించి, ఇప్పటి వరకు సుమారు 1,200 మందికి దాదాపు రూ.32 లక్షల జరిమానాలు విధించారు. ఈ చర్యలు మున్ముందు మరింత ముమ్మరంగా అమలు చేసేందుకు జలమండలి ప్రత్యేక విజిలెన్స్ టీమ్‌లను కూడా సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Minister Seethakka: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?

