KTR: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ దే విజయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ప్రారంభించిన ‘బాకీ కార్డు’ ఉద్యమమే రేవంత్ సర్కార్ ను భరతం పట్టే బ్రహ్మాస్త్రమన్నారు. తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు కేటీఆర్ (KTR) గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ గల్లీ ఎన్నికలైనా, ఢిల్లీ ఎన్నికలైనా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని, తెలంగాణలోని సబ్బండ వర్ణాలు తిరిగి కేసీఆర్‌నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాయన్నారు.
ఉన్న నగరాన్ని ఉద్ధరించలేని వారు కొత్త నగరం కడతారా?
తాము ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని కానీ ప్రజలకు అన్నీ గుర్తున్నాయన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఈ బాకీ కార్డే కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తుందన్నారు. హైదరాబాద్ నగరం సమస్యలతో ఆగమాగం అవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కొత్త నగరం కడతానంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో హైదరాబాద్‌లో చెత్త తీసేవారు కరువయ్యారని, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని, వీధి దీపాలు వెలగడం లేదని మండిపడ్డారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించలేని వారు కొత్త నగరం కడతామని ఫోజులు కొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Also Read: Asia Cup 2025 Final: 41 ఏళ్ల తర్వాత పాక్‌తో ఫైనల్స్.. కెప్టెన్ సూర్యకుమార్ షాకింగ్ రియాక్షన్!
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై తీవ్ర ఆగ్రహం
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని, కనీసం ఉన్న రోడ్లను కూడా సరిగా నిర్వహించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం రైతులు యుద్ధాలు చేసే దుస్థితి ఉండేదని, నేడు మళ్లీ అవే రోజులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కోసం క్యూలైన్లలో చెప్పులు పెట్టే, ప్రాణాలు కోల్పోయే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని, తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాగంటి గోపినాథ్ నాయకత్వంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదని గుర్తుచేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన సతీమణి మాగంటి సునీతను ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రదీప్ చౌదరి వంటి ప్రజాబలం ఉన్న నాయకుల చేరికతో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. తెలుగువారి ఖ్యాతిని యావత్ భారతదేశానికి చాటిచెప్పింది ఎన్టీఆర్ అయితే, తెలంగాణ అస్తిత్వ పతాకాన్ని, సత్తాను హిమాలయాల స్థాయిలో ఎగరేసింది కేసీఆర్ అని కొనియాడారు. 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని, పదేళ్ల పాలనలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.
మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయం
మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంధిలా భాస్కర్ గౌడ్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఉన్నారు.
Also Read: Movie Piracy Racket: దేశంలోనే అతిపెద్ద పైరసీ రాకెట్ గుట్టు రట్టు.. వెలుగులోకి సంచలన నిజాలు