KTR: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. బస్తీ దవాఖానల్లో సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. 108 రకాల మందులు అందుబాటులో ఉండాల్సిన బస్తీ దవాఖానల్లో సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీం నగర్ బస్తీ దవాఖానను మాజీ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, స్థానిక కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.రోగులతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Also Read: KTR: మెడికల్ డివైస్ పార్క్ కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం: కేటీఆర్
పేదల కోసం నాలుగు టీమ్స్ వెయ్యి పడకల ఆసుపత్రులు
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు, పేదలకు ఆరోగ్య సేవలను అందించాలనే ఉద్దేశంతో 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకు తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీతోపాటు దానికి అనుబంధంగా ఆసుపత్రి కూడా నిర్మించామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ఆధ్వర్యంలో పేదల కోసం నాలుగు టీమ్స్ వెయ్యి పడకల ఆసుపత్రులను ప్రారంభించామని, అలాగే 2000 పడకల నిమ్స్ విస్తరణ ప్రారంభించామని, 90 శాతం పనులను మేమే పూర్తి చేశామని కానీ ఈ ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులు కూడా చేయలేకపోతోందని మండిపడ్డారు.
ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదా?
హైదరాబాద్ లో చెత్త ఎత్తడం సరిగా జరగడం లేదని, దోమలతో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదనేది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. మేము 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం.. కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రజలపైచిత్తశుద్ధి ఉంటే, మరో 450 దవాఖానాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీమ్స్ ఆసుపత్రులను వెంటనే పూర్తి చేసి ప్రజల సేవలోకి తీసుకురావాలని, లేదంటే త్వరలో టీమ్స్ ఆసుపత్రుల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులపై నివేదిక సిద్ధం చేసి త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని, వారికి ఇచ్చిన జీత పెంపు హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎలా వచ్చింది?
దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయన పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎలా వచ్చింది? ఆశ్చర్యకరంగాఉందన్నారు. ఆయన ఏ పార్టీలో గెలిచారో, ఎక్కడ చేరారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చేరికల విషయంలో నీతిని, నైతిక విలువలను పూర్తిగా కోల్పోయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు కూడా తాము ఏ పార్టీలో ఉన్నామో చెప్పే ధైర్యం లేదన్నారు. ఇది ఇకపై ఏఐసీసీ స్టార్ క్యాంపెనర్ లిస్ట్ కాదు, ‘ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అని దుయ్యబట్టారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నాయకులుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్‌లో చేరలేదని చెబుతున్న కాంగ్రెస్, అదే సమయంలో మా ఎమ్మెల్యే పేరు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చడం సిగ్గుచేదని, ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని మండిపడ్డారు.
సున్నం చెరువులో దీపావళి వేడుక
శేరిలింగంపల్లిలోని సున్నం చెరువు వద్ద హైడ్రా బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీపావళి వేడుకను వారితో కలిసి జరుపుకున్నారు. నిరాశ్రయులైన పేదలకు ధైర్యం చెప్పే ఉద్దేశంతో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సందర్శించారు. గత జూన్ 30వ తేదీన శేరిలింగంపల్లి సున్నం చెరువు వద్ద నిరుపేదల ఇళ్లను ‘హైడ్రా’ సహాయంతో కూల్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నిరుపేదల కడుపు కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని మండిపడ్డారు.
ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఏం సహాయం చేయలేదని, అందుకే నిలువునీడ లేకుండా పోయిన నిరుపేదలతో కలిసి దీపావళి జరుపాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాము వచ్చి హైడ్రా బాధితులతో కలిసి దీపావళి జరుపుకుంటేనైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుపేదలకు ధైర్యం చెప్పడానికే ఇక్కడికి వచ్చామని, బాధిత కుటుంబాలతో కలిసి దీపావళి జరుపుకొని, సహాయం చేయడానికి వచ్చామని కేటీఆర్ స్పష్టం చేశారు. మళ్ళీ బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి హైడ్రా బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: KTR: బాకీ కార్డుతో ప్రభుత్వ భరతం పడతాం.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
