Kavitha: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హామీ ఇచ్చారు. ఆటో యూనియన్ ల నాయకులతో బుధవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆటోడ్రైవర్లకు ఇస్తామన్న రూ. 12 వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఇతర జిల్లాల ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలిగించటంపై ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై అన్ని ఆటో సంఘాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు.
Also Read: Kalvakuntla Kavitha: బీసీ కులగణనపై బీజేపీ కొత్త మోసానికి తెరలేపారు: కల్వకుంట్ల కవిత
ఆటో డ్రైవర్లను అడ్డుకోవటం సరికాదు
అవసరమైతే కార్మిక శాఖ మంత్రి ని కలుస్తామన్నారు. చట్టబద్దమైన అనుమతులు ఉన్నప్పటికీ జిల్లాల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లను అడ్డుకోవటం సరికాదన్నారు. కార్మికుల భద్రతతో పాటు వారి ఉపాధి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో జిల్లాల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లపై జరుగుతున్న దాడులు, వేధింపులు తక్షణమే అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమస్యపై సంబంధిత పోలీస్, రవాణా శాఖ అధికారులతో మాట్లాడి జిల్లాల ఆటో డ్రైవర్లకు పూర్తి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జాగృతి ఎప్పుడూ నిలుస్తుంది
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కార్మికుల పక్షాన తెలంగాణ జాగృతి ఎప్పుడూ నిలుస్తుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్ సింగ్, ఆటో జాగృతి అధ్యక్షుడు ఎంఏ సలీమ్, ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ వెంకటేష్, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ మల్లేశం గౌడ్, టీఏడీఎస్ ప్రెసిడెంట్ సత్తిరెడ్డి, టీఎన్టీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి, జీయూటీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్టీయూ అధ్యక్షుడు పరశురాముడు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
Also Read: Kalvakuntla Kavitha: రిపబ్లిక్ డే రోజన కవిత సంచలన నిర్ణయం.. బీసీల కోసం కీలక ప్రకటన

