Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు (Jubilee Hills Bypoll) నామినేషన్లు వెల్లువెత్తుతున్నాయి. నాలుగో రోజైన కూడా అత్యధిక సంఖ్యలో 19 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్ పి. సాయిరాం కు సమర్పించినట్లు జిల్లా ఎలక్షన్ వింగ్ తెలిపింది. వీరిలో ఇద్దరు అభ్యర్థులు ఇదివరకే నామినేషన్లు జారీ చేయగా, అదనంగా సెట్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణకు మొదటి రోజైన ఈ నెల 10 మంది అభ్యర్థులు 11 నామినేషన్లు దాఖలు చేయగా, మరుసటి రోజైన 14న 10 మంది అభ్యర్థులు 11 నామినేషన్ లు దాఖలు చేయగా, మూడో రోజైన బుధవారం 12 మంది అభ్యర్ధులు 13 సెట్లుగా నామినేషన్లను దాఖలు చేశారు.
Also Read: Jubilee Hills Bypoll: గులాబీకి ‘సర్వే’ ఫియర్!.. ఎందుకీ భయం?
మొత్తం 32 మంది అభ్యర్థులు
మధ్యాహ్నాం మూడు గంట వరకు మొత్తం 32 మంది అభ్యర్థులు 35 సెట్లుగా నామినేషన్లను సమర్పించగా, ఒక్క రోజే 16 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లను సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో తెలంగాణ ప్రజాజీవన రైతు పార్టీ అభ్యర్థిగా చుండి శోభన్ బాబు, సోషలిస్టు పార్టీ (ఇండియా) అభ్యర్థిగా రాచ సుభద్రా రెడ్డి లు ఒక్కో సెట్ నామినేషన్లను సమర్పించారు. ఇక స్వాతంత్య్ర అభ్యర్థులుగా అమీర్ సాజిద్, తీటి సుధాకర్ రావు, భూషిపాక వెంకటయ్య, మూల్య సంజీవులు, దేవీకన్న చౌదరి పసుపులేటి, మహ్మద్ జహీద్ ఖాన్, మారం వెంకట్ రెడ్డి, రేకల సైదులు, బండారు నాగరాజు, వేముల విక్రమ్ రెడ్డి, కుతాడి గౌతమ్ ఎకలవ్య ఎరుకల, రమేశ్ బాబు శనిగరపు, జస్వంత్ జీవన్ కుమార్ లు ఒక్కో సెట్ నామినేషన్లను సమర్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ తెలిపారు.
ఈవీఎం, వీవీ ప్యాట్ ఫస్ట్ రాండమైజేషన్ పూర్తి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏర్పాట్లలో భాగంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ( ఈవీఎం), ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ ( వీవీ ప్యాట్ ) ఫస్ట్ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ర్యాండమైజేషన్ ను నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఈ డమైజేషన్ ప్రక్రియను ఈవీఎం మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎంఎస్ ) ద్వారా, జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల కోసం మొత్తం 569 బ్యాలెట్ యూనిట్లు, 569 కంట్రోల్ యూనిట్లు, 610 వీవీ ప్యాట్ లను కేటాయించినట్లు తెలిపారు. ఈ ర్యాండమైజేషన్ జాబితాను సంబంధిత రాష్ట్ర, జాతీయ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పంచుకున్నారు. ఎంపికైన ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు సంబంధిత నియోజకవర్గ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్లు ఆయన తెలిపారు. తదుపరి, పోటీ అభ్యర్థుల తుది జాబితా ఖరారైన తర్వాత, ఈ ర్యాండమైజ్ చేసిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ ల వివరాలను అభ్యర్థులతో పంచుకోనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
