Jubilee Hills Bypoll: రోజురోజూకు తగ్గుతున్న గ్రాఫ్
కేటీఆర్, హరీష్ రావు సమాలోచనలు!
పార్టీ సర్వేలోనే వెలుగులోకి..
డివిజన్ల వారీగా సమావేశాలు
కాంగ్రెస్ స్కెచ్‌లో విలవిల
ప్రజల్లోకి ఏ సెంటిమెంట్‌తో వెళ్లాలనేదానిపై తర్జనభర్జన
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గులాబీ పార్టీకి సర్వే భయం పట్టుకుంది. జూబ్లీహిల్స్‌లో (Jubilee Hills Bypoll) ప్రజల నాడి తెలుసుకునేందుకు చేస్తున్న సర్వేల్లో ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకూ తగ్గితున్నట్టుగా వెల్లడైనట్లు సమాచారం. ఆరు డివిజన్లలో తాజాగా నిర్వహించిన సర్వేల్లో అసలు విషయం తెలుగులోకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఉప ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పుడు బీఆర్ఎస్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు సమాచారం. నెల రోజులకు ముందు అన్ని పార్టీల కంటే 15 శాతం గ్రాఫ్ ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇంకా పెంచుకునేందుకు బీఆర్ఎస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. కాంగ్రెస్ హామీల వైఫల్యాలపై గ్యారెంటీ కార్డులను ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేస్తుంది. అయినప్పటికీ గ్రాఫ్ భారీగా పడిపోయిందని తాజాగా నిర్వహించిన సర్వేల్లోనే వెల్లడైనట్లు సమాచారం. 15 నుంచి 4 నాలుగు శాతానికి పడిపోయినట్లు పార్టీ నేతలే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఆ నాలుగు శాతం గ్రాఫ్ బీఆర్ఎస్ పార్టీదా? లేకుంటే కాంగ్రెస్ పార్టీదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందని చెబుతున్నది నేతలే పలు సందర్భాల్లో అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
కేటీఆర్, హరీష్ రావు సమాలోచనలు
ఉప ఎన్నికల్లో గెలుపును బావబామ్మర్దులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రచారశైలిపై ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు. అందుకోసం నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో వార్ రూమ్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఏ డివిజన్‌లో ప్రచారంలో వెనుకబడ్డాం.. ఎలా ముందుకు వెళ్లాలి.. ప్రజలను ఎలా ఆకట్టుకోవాలనేదానిపై సూచనలు చేస్తున్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సర్వేల్లో ఆశించిన స్థాయిలో గ్రాఫ్ పెరగకుండా తగ్గుతుండటంపై సమాలోచన చేస్తున్నారు. ఏం చేస్తే బీఆర్ఎస్‌కు ప్రజలు ఆకర్షితులవుతారు?, ఏ హామీలు ఇవ్వాలి?, తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. 20 రోజుల్లోనే జూబ్లీహిల్స్ ఎన్నిక ఉండటంతో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారనేది ఆసక్తి నెలకొంది.
Read Also- Telangana Tourism: రామప్ప ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పాలి.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
కాంగ్రెస్ స్కెచ్‌లో విలవిల
కాంగ్రెస్ పార్టీ ఆచితూచీ అభ్యర్థిని ప్రకటించింది. సర్వేలు చేసి మరీ నవీన్ యాదవ్ ను ప్రకటించి ప్రచారంను విస్తృతం చేసింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, స్లమ్ ఏరియాల్లో ఆదరణ ఉండటం, మైనార్టీ వర్గాలతో పరిచయాలు ఉండటంతో ఆయనకు మంచి స్పందన వస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఊహించని దెబ్బ తగిలినట్లయింది. సెంటిమెంట్ తో పాటు గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనుల పైనే నమ్ముకుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, ఎంఐఎం సైతం మద్దతు ఇస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. దీనికి తోడు వామపక్షాల మద్దతును సైతం కాంగ్రెస్ కూడగడుతుంది. దీంతో బీఆర్ఎస్ ఒంటరిపోరు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వైఫల్యాలు అస్త్రంగా బీఆర్ఎస్ వెళ్తున్నప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లోకి ఏ సెంటిమెంట్ తో వెళ్లాలనేదానిపై తర్జనభర్జన పడుతుంది.
Read Also- Telangana Bandh: రేపు తెలంగాణ బంద్.. మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
డివిజన్ల వారీగా సర్వేలు
బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్లలో సర్వేలు నిర్వహిస్తుంది. ప్రజల నాడిని తెలుసుకుంటుంది. అందులో భాగంగానే ప్రజలను మోటివేషన్ చేయాలని భావిస్తుంది. తెలంగాణ భవన్ వేదికగా సర్వే టీంలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం భేటీ అయ్యారు. ఒక్కో డివిజన్ లో పార్టీ పరిస్థితి, ఏం చేస్తే అక్కడి ఓటర్లను ఆకట్టుకోవచ్చనే అంశాలపై చర్చించారు. ఈ భేటీలోనే బీఆర్ఎస్ కు గ్రాప్ తగ్గుతున్నట్లు సర్వే టీంలు చెప్పినట్లు సమాచారం. మరోవైపు నియోజకవర్గానికి చెందిన స్థానిక నేతలు, సీనియర్ నేతలు సైతం కలిసి పనిచేయడంలో కొంత గ్యాప్ ఉన్నట్లు సమాచారం. నాకేందుకులే.. నాకు పార్టీ ప్రియార్టీ ఇవ్వనప్పుడు ప్రచారం చేసి ఏం లాభం అనే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉందని నేతలే అభిప్రాయపడుతున్నారు.
