జగిత్యాల, స్వేచ్ఛ: Jagityala Constituency: హస్తం పార్టీలో పదవుల పందేరానికి తెరలేపిన, పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటిన జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటికీ ఏ ఒక్క పదవి భర్తీ కాలేదు. దీంతో నామినేటెడ్ పదవుల కోసం పోటీపడుతున్న ద్వితీయ శ్రేణి కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ప్రభుత్వం ఏర్పడక ముందు జెండా మోసిన వారంతా ఆశలు పెట్టుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని తామై వ్యవహరించిన తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయో లేదో అని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also read: SC on TG Govt: తెలంగాణ ప్రభుత్వానికి ‘సుప్రీం’ నోటీసులు.. ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే?
మారిన రాజకీయం…
జగిత్యాల నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో పాత కార్యకర్తలు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. ఎమ్మెల్యే తన అనుచరులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో పాత కార్యకర్తలు కంగుతున్నారు. ముందు వచ్చిన చెవులకన్న వెనుక వచ్చిన కొమ్ములు గొప్ప అన్నట్లు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా తట్టుకొని పార్టీ వెంట ఉన్న, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ అవసరాల రీత్యా కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారు క్రియాశీలంగా ఉంటున్నారని సామాన్య కార్యకర్తలు మండిపడుతున్నారు.
పదవుల భర్తీ లో అస్పష్టత…
జిల్లాలో ఉన్న మిగతా నియోజకవర్గాలైన ధర్మపురి , కోరుట్ల, వేములవాడ లోని మేడిపల్లి , కథలాపూర్, చొప్పదండిలోని మల్యాల మార్కెట్ కమిటీలను పూర్తిచేసిన ప్రభుత్వం, జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల , రాయికల్ మార్కెట్ కమిటీల నియామకంలో ముందుకు సాగడం లేదు . అదేవిధంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్, ఆర్టిఏ నెంబర్ , పలు ఆలయాల పాలక మండళ్ళు తో పాటు అనేక పదవుల భర్తీ చేయడానికి అవకాశాలున్న తీవ్ర జాప్యం జరగడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also read: Betting Suicide Cases: ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు.. బలైంది ఎందరో!
ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ…
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లో చేరికపై మొదటి నుంచి విభేదిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నామినేటెడ్ పదవుల్లో తన అనుచరులకే ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది . జగిత్యాల రాయికల్ మార్కెట్ కమిటీలు నియామకం కోసం ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ ఇద్దరు వేరువేరుగా ప్రభుత్వానికి సిఫార్సు లేఖలు పంపడంతో ఆ ఎంపికను ప్రభుత్వం పక్కన పెట్టిందని పలువురు కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.
ఎమ్మెల్సీ వర్గంలో నిరాశ…
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదవి కాలం ఈ నెలతో ముగియడంతో అతని అనుచరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వస్తుందని అనుకున్న రాజకీయ సమీకరణలో భాగంగా పదవి రాకపోవడంతో ఎమ్మెల్సీ వర్గీయులు తీవ్ర నిరాశ చెందారు. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలైన సర్పంచ్ ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పిటిసి తోపాటు నామినేటడ్ పదవులు తమకు అవకాశం ఉంటుందో లేదో అని ఎమ్మెల్సీ వర్గీయులు అనుకుంటున్నారు. మొత్తానికి ఆవులు, ఆవులు తన్నుకుంటే లేగ దూడల కాళ్లు విరిగినట్లు అయింది కార్యకర్తల పరిస్థితి . ప్రభుత్వం నామినేటడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపడితే ఎవరికి ప్రాముఖ్యత ఇస్తుందో, ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి మరి…