Betting Suicide Cases: ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి 6న సురేశ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అదే నెల 11న వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రాజ్ కుమార్ నాలుగు లక్షల రూపాయలు అప్పు కట్టలేక ఉరివేసుకొని బలవన్మరణం. అలాగే ఫిబ్రవరి 17న కామారెడ్డి జిల్లా దేవనపల్లిలోని మరో యువకుడు సంజీవ్ కుమార్ సూసైడ్. గత అక్టోబర్లో నిజామాబాద్ ఎడపల్లి లో కొడుకు తో పాటు తల్లితండ్రులు ఆత్మహత్య. వీళ్లంతా ఎవరు అనుకుంటున్నారా? బెట్టింగ్ భూతానికి బలైపోయిన అమాయకులు. బెట్టింగ్ యాప్స్, ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ ల కబంధ హస్తాల్లో నలిగిపోయిన దురదృష్టవంతులు.
వీళ్లే కాదు జీడిమెట్లలో వెంకటేశ్, కరీంనగర్ లో నిఖిల్, మహేశ్వరంలో సాయికిరణ్, మాదాపూర్ లో అరవింద్ ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ప్రాంతాలు, బలైపోయిన ఎన్నో యువ జీవితాలు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చర్చనీయాంశం బెట్టింగ్ యాప్స్(Betting Apps). మహామ్మారిలా మారిన ఈ యాప్స్ బారినపడి అమాయకులు బలవుతున్నారు. యూట్యూబ్ ఇన్ ఫ్లూయెన్సర్లతో పాటు స్టార్ హీరోలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్(Gaming Apps) ప్రమోట్ చేస్తుండంతో అమాయకులు వాటికి ప్రభావితలవుతున్నారు. మెల్లగా బానిసలవుతున్నారు. చివరకు ఆ ఉచ్చులో ఇరుక్కొని సర్వం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని సర్కార్ సీరియస్ గా తీసుకుంది. యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై(Celebrities) కొరడా ఝళిపిస్తున్నది. ముఖ్యంగా హర్షసాయి, లోకల్ బాయ్ నానీ, యాంకర్ శ్యామల వంటి ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. అలాగే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ప్రకాశ్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మీ(Manchu Lakshmi)లపై నటుల పైన కూడా పోలీసులు కేసులు పెట్టారు.
సజ్జనార్ దెబ్బ.. ఇన్ ఫ్ల్యూయెన్సర్లు అబ్బా !
సీనియర్ పోలీసాఫీసర్, ఎన్ కౌంటర్ స్పెషలిస్టు, ప్రస్తుత టీజీఆర్టీసీ మేనెజింగ్ డైరెక్టర్.. వీసీ సజ్జనార్(VC Sajjanar) చాలా కాలంగా ఈ బెట్టింగ్ యాప్ ల గురించి గేమింగ్ యాప్స్ గురించి తీవ్రంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ యాప్ లకు బానిసలై ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని హితవు చెప్తున్నారు. ఆయన చెప్పడంతోనే వాటిని ప్రమోట్ చేస్తున్న యూట్యూబ్ ఇన్ ఫ్లూయెన్సర్లపై చర్యలు తీసువడం మొదలైంది.
ముందుగా ఏపీకి చెందిన లోకల్ బాయ్ నానీ(Local Boy Nani)ని వైజాగ్ పోలీసులు అరెస్టు చేయడంతో ఇన్ ఫ్ల్యూయెన్సర్లందరిలో వణుకు మొదలైంది. తదనంతరం పెద్ద తలకాయల దాకా ఉచ్చు బిగుసుకుంది. ప్రముఖ యూట్యూబర్లు విష్ణుప్రియ(vishnuPriya), రీతూ చౌదరి(Ritu chowdary) వంటి వారిని పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నారు. ఇక, ప్రమాదాన్ని ముందే పసిగట్టిన హర్షసాయి(Harsha sai) లాంటి వాళ్లు విదేశాలకు పారిపోయారు.
అయితే తాజాగా బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి మరో కీలక పరిణామం మొదలైంది. ఈ విషయంలో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏడాది కాలంగా దాదాపు 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు అయ్యాయి.
ఈ కేసులను ప్రస్తుతం పోలీసులు వెలికి తీస్తున్నారు. అమాయక యువకకుల ప్రాణాలు పోవడానికి కారణమైన ఆయా బెట్టింగ్ యాప్స్ ను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. బెట్టింగ్ యాప్స్, వాటి నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇక బెట్టింగ్ కంపెనీలకు ఇక దబిడి దిబిడే అని ఈ విషయం తెలిసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.