BJP National President: బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం దృష్టిసారిస్తోంది. ఈ ప్రక్రియను ఈనెలలో పూర్తిచేయాలని భావిస్తోంది. దేశంలో ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఎన్నికలు లేకపోవడంతో ఈ ప్రక్రియను పూర్తిచేసి వచ్చే ఏడాది మే, జూన్ లో జరగబోయే ఎన్నికలకు సిద్ధమవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. కాగా ఈ రేసులో పలువురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కాగా తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పేరు కూడా వినిపిస్తోంది. రాబోయే కాలంలో దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణలో పార్టీని విస్తరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆయా రాష్ట్రాల్లో పార్టీకి మైలేజ్ వస్తుంది
ఈ నేపథ్యంలో దక్షిణాదికి చెందిన బలమైన నేతను జాతీయ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో పార్టీకి మైలేజ్ వస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఈ కోణంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. కిషన్ రెడ్డికి పార్టీలో బలమైన సంస్థాగత అనుభవం ఉంది. ఆయన భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాలుగుసార్లు పనిచేసిన అనుభవం ఉంది. అంచెలంచెలుగా ఎదిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన కేంద్ర మంత్రివర్గంలో పనిచేయడం, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితుడిగా, విశ్వసనీయుడిగా ఉండటం ఆయనకు సానుకూలాంశాలుగా మారే చాన్స్ ఉంది.
కొత్త అధ్యక్షుడి పేరును త్వరలో ప్రకటించే అవకాశం
ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకంపై ప్రస్తుతం హైకమాండ్ సమాలోచనలు చేస్తోంది. ఈ వారంలోగా ఈ అంశాన్ని తేల్చేసి ఈ నెలాఖరులో ఏ క్షణాన్నయినా జాతీయ అధ్యక్ష నియామకాన్ని పూర్తిచేయాలని చూస్తోంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకోగా, కొత్త అధ్యక్షుడి పేరును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. జాతీయ అధ్యక్ష పదవి రేసులో ప్రముఖంగా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేందర్ యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డి, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు వినిపిస్తున్నాయి.
Also Read: Telangana BJP: లోకల్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు కమలం సిద్ధం.. నెక్స్ట్ ప్లాన్ ఇదేనా..!
వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రచారం
అలాగే మహిళలకు ఇవ్వాలనుకుంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, డీ పురందేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటి వరకు బీజేజీ జాతీయ అధ్యక్ష పీఠంపై కూర్చునే అవకాశం మహిళలకు ఒక్కసారి కూడా దక్కకపోవడం గమనార్హం.కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్, ఈ పదవికి బలమైన పోటీదారుగా ఉన్నారు. ఆయన ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఓబీసీ నేత. ఆర్‌ఎస్‌ఎస్ తో, పార్టీ సంస్థాగత యంత్రాంగంతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇటీవల ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర కీలకమని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు క్షేత్రస్థాయిలో మంచి ప్రజాదరణ ఉంది. విస్తృతమైన సంస్థాగత అనుభవం కలిగిన ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది.
మహిళలలో వీరి పేర్లను పార్టీ పరిగణలోకి తీసుకునే చాన్స్
చౌహాన్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పార్టీ అత్యున్నత నేతలకు సన్నిహితుడిగా, ఎన్నికల వ్యూహాలను రూపొందించడంలో కీలకపాత్ర పోషించే సమర్థుడిగా పేరుంది. ఆయన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓబీసీ నేత. హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.., పరిపాలనలో స్థిరమైన అనుభవం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేరు కూడా రేసులో ఉంది. ఆయన యూపీలో పార్టీకి కీలకమైన నేతగా వ్యవహరిస్తున్నారు. నిర్మలా సీతారామన్, పురందేశ్వరి, వనతి శ్రీనివాసన్.. ముగ్గురూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతలే. మహిళలకు ఇవ్వాలనుకుంటే వీరి పేర్లను పార్టీ పరిగణలోకి తీసుకునే చాన్స్ ఉందని తెలుస్తోంది.
బీజేపీ అధిష్టానం ఎప్పుడూ ఊహించని నిర్ణయాలు
బీజేపీలో సాధారణంగా అధ్యక్షుడి ఎంపిక ఏకాభిప్రాయం ద్వారా జరుగుతుంది. ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, సంస్థాగత అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే బీజేపీ అధిష్టానం ఎప్పుడూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, రాంనాథ్ కోవింద్, ఢిల్లీ సీఎం రేఖా గుప్త, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ నియామకంలో హైకమాండ్ ఎవరి ఊహకు అందని పేర్లను తెరపైకి తీసుకువచ్చింది. మరి ఈసారి హైకమాండ్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందనేది చూడాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ.., తుది నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతుల్లో ఉండటంతో ఉత్కంఠగా మారింది.
Also Read: Vijayasai Reddy BJP: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా విజయసాయిరెడ్డి? ఇక జగన్ కు చుక్కలేనా!

