Panchayat Election: రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్, అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. కొన్ని గ్రామ పంచాయతీల్లో విజయం కేవలం ఒక్క ఓటు తేడాతోనే నిర్ణయమవడంతో, ఈ ఎన్నికలు చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగే ట్వంటీ-ట్వంటీ క్రికెట్ మ్యాచ్‌ను తలపించాయి. అత్యంత స్వల్ప మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థుల విజయాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. శంకరపట్నం మండలం, అంబాలపూర్ గ్రామ సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత, కాంగ్రెస్ అభ్యర్థి వడ్లకొండ వెంకటేశ్ తన ప్రత్యర్థి మల్లేశంపై కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.
Also Read: Panchayat Elections: రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల్లోను కాంగ్రెస్‌దే పై చెయ్యి..!
మరోసారి రికౌంటింగ్
మెజారిటీ చాలా స్వల్పంగా ఉండటంతో, ఎన్నికల నిర్వహణ అధికారులు మరోసారి రికౌంటింగ్ నిర్వహించారు. అయినా ఫలితం అదే కావడంతో, వెంకటేశ్ గెలుపొందినట్లు ప్రకటించారు. అనంతరం వెంకటేశ్ బంధువులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇక, తిమ్మాపూర్ మండలంలోని గ్రామ పంచాయతీల్లోనూ ఇలాంటి ఉత్కంఠభరిత ఫలితాలే నమోదయ్యాయి. మహాత్మ నగర్ గ్రామ పంచాయతీలో బీఆర్‌ఎస్ అభ్యర్థి పొన్నాల సంపత్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు ఏకానందంపై ఒక్కే ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అదే మండలంలోని ముంజంపల్లి గ్రామంలో రవీంద్ర చారి తన ప్రత్యర్థి లింగయ్యపై కూడా ఒక్క ఓటు తేడాతోనే గెలుపొందారు.
మూడు ఓట్ల తేడాతో విజయం
మరికొన్ని గ్రామాల్లోనూ మెజారిటీ రెండు, మూడు ఓట్లకు మించలేదు. కొత్తపల్లి గ్రామంలో శోభారాణి తన సమీప అభ్యర్థి కనకలక్ష్మీపై రెండు ఓట్ల తేడాతో గెలుపొందగా, పోలంపల్లి గ్రామంలో లావణ్య అనే అభ్యర్థి జ్ఞానేశ్వరిపై మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. బాలయ్య పల్లి గ్రామంలో శ్రీనివాస్ అనే అభ్యర్థి కిష్టయ్యపై మూడు ఓట్ల స్వల్ప తేడాతోనే గెలుపొందడం విశేషం. ఈ ఫలితాలు గ్రామ స్థాయిలో ప్రతి ఓటు ఎంత విలువైనదో మరోసారి స్పష్టం చేశాయి.
Also Read: Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

