Bhatti Vikramarka: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మల్లు వెల్లడించారు. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో పెండింగ్‌లో ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను రాబోయే 2026 మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని కూడా డిప్యూటీ సీఎం ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీలో సింగరేణిపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానమిచ్చారు. ప్రస్తుతం 11 మంది కాంట్రాక్ట్ డాక్టర్లు పనిచేస్తున్నారని 32 మంది డాక్టర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని త్వరలోనే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. 176 పారామెడికల్ సిబ్బంది అంతర్గత నియామకం ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. రామగుండంలో క్యాత్ లాబ్ నిర్మాణం పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ ప్రాతిపదికన చేపడుతున్నామని, కాంట్రాక్ట్ అవార్డు కూడా పూర్తయిందని, ల్యాబ్‌ను 75 రోజుల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు సింగరేణి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సకాలంలో వారికి కావల్సిన మోతాదులో మెడిసిన్ అందేలా సౌకర్యం కల్పిస్తున్నామని, సీపీఆర్ఎంఎస్ పథకం అందుబాటులో ఉందని వెల్లడించారు.
ప్రత్యేక సమావేశం
రిటైర్డ్ ఉద్యోగులు రూ. 8 లక్షల లిమిట్ వరకు విలువైన మందులను తీసుకునే అవకాశం కూడా కల్పించామని భట్టి చెప్పారు. టెర్మినల్ బెనిఫిట్స్ కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని ఖాళీ స్థలాల్లో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు ఇండ్ల నిర్మాణం, క్వార్టర్స్‌లో నివాసముంటున్న వారిని రిటైర్డు కాగానే ప్రత్యామ్నాయం చూపకుండానే ఖాళీ చేయిస్తున్నట్లు కొందరు సభ్యులు సభ దృష్టికి తెచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ క్వార్టర్స్ ఖాళీ, రిటైర్డు ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించేందుకు బోర్డు, కార్మిక సంఘాలతో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ సింగరేణి సంస్థని వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులపై అందరిపై ఉందన్నారు.
Also Read: Bhatti Vikramarka: గత ప్రభుత్వ పాలకులు కవులను వాడుకుని వదిలేశారు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మా టార్గెట్ ఇదే
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ సవాళ్ల మధ్య సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాల వల్ల రాష్ట్రంలోని బొగ్గు గనులను నేరుగా సింగరేణికి కేటాయించకుండా, వేలం నిర్వహిస్తున్నారని, దీనివల్ల ప్రైవేట్ ఏజెన్సీలు రంగ ప్రవేశం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వేలం ప్రక్రియలో పాల్గొనకపోవడం వల్ల సింగరేణి కొన్ని గనులను కోల్పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణిని స్వయంగా వేలంలో పాల్గొనేలా ప్రోత్సహించి కొన్ని బొగ్గు బావులను దక్కించుకునేలా చేశామని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్‌లో సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గు ధర కంటే ప్రైవేట్ సంస్థలు తక్కువ ధరకే బొగ్గును సరఫరా చేస్తున్నాయని, వినియోగదారులు సహజంగానే తక్కువ ధర ఎక్కడ ఉంటే అక్కడ కొనుగోలు చేస్తారని వివరించారు. ఈ పరిస్థితి సింగరేణి బొగ్గు అమ్మకాలపై ప్రభావం చూపుతుందని, సింగరేణి మనుగడ, కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కూడా త్వరలోనే చర్చించనున్నట్లు భట్టి వివరించారు.
విద్యుత్ శాఖలో కూడా
పది రోజుల్లోగా సింగరేణి (Singareni) పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సంస్థ సీఎండీ, డైరెక్టర్లతో ఈ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని భట్టి మరోసారి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా సింగరేణి సంస్థపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా కేవలం బ్యాంకుల ద్వారానే కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు. సింగరేణిలో విజయవంతంగా అమలు చేస్తున్న ఈ కోటి రూపాయల బీమా పథకాన్ని, అదే తరహాలో విద్యుత్ శాఖలోని డిస్కమ్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విక్రమార్క తెలిపారు.

